రాష్ట్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆమోదం లభించింది.
- మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణపై సీఎంకు పూర్తి స్వేచ్ఛ
- మరో 14మందికి మంత్రి మండలిలో చోటు
- నేడు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం!
- పదవులు కోల్పోనున్న మంత్రుల తిరుగుబావుటా ?
- ఎమ్మెల్యే స్థానానికి కూడా రాజీనామా చేస్తానని అంబి హెచ్చరికలు
బెంగళూరు: రాష్ట్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆమోదం లభించింది. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణలో సీఎం సిద్ధరామయ్యకు పూర్తి స్వేచ్ఛను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కల్పించారు. ఇదే సందర్భంలో పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాటను కూడా పూర్తిగా తీసేయకుండా ఆయన కోరిన వారిలో ఒకరిద్దరిని మంత్రి పదవుల్లో కొనసాగించడంతో పాటు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు మంత్రి మండలిలో స్థానం కల్పించాల్సిందిగా సోనియాగాంధీ ఆదేశించినట్లు సమాచారం.
ఇక ఇదే సందర్భంలో చక్కని పనితీరును కనబరుస్తున్న రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్‌ను సైతం మంత్రి పదవి నుంచి తప్పించరాదని సోనియాగాంధీ, సీఎం సిద్ధరామయ్యను ఆదేశించినట్లు తెలుస్తోంది. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు సంబంధించి గత రెండు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న కసరత్తు ముగిసింది. దీంతో శనివారం సాయంత్రం సీఎం సిద్ధరామయ్య ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్నారు. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు సంబంధించి సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్వేచ్ఛను కల్పించడంతో మొత్తం 14 మందిని మంత్రి మండలి నుంచి తప్పించేందుకు సిద్ధరామయ్య నిర్ణయించారు.
మంత్రులు కిమ్మనె రత్నాకర్, శ్యామనూరు శివశంకరప్ప, పరమేశ్వర్ నాయక్, అంబరీష్, శ్రీనివాసప్రసాద్, ఖమరుల్ ఇస్లామ్, అభయ్ చంద్రజైన్, మనోహర్ తహశీల్దార్, వినయ్‌కుమార్ సూరకె, దినేష్ గుండూరావ్, ఎస్.ఆర్.పాటిల్, సతీష్ జారకీహోళీ, శివరాజ్ తంగడగి, బాబూరావ్ చించన్‌సూర్‌లను మంత్రి మండలి నుంచి తప్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ వీరందరికీ తమ తమ రాజీనామా పత్రాలను అందజేయాల్సిందిగా సీఎం సిద్ధరామయ్య సూచించినట్లు సమాచారం.
వీరిలో శ్యామనూరు శివశంకరప్ప, అంబరీష్‌లను వారి వయసు, అనారోగ్య కారణాల వల్ల మంత్రి పదవుల నుంచి తప్పిస్తుండగా, మిగతా వారిలో కొంతమందిని అవినీతి ఆరోపణలు, సరైన పనితీరును కనబరచకపోవడం వంటి కారణాలతో మంత్రి వర్గం నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం. ఇక మంత్రి పదవులను కోల్పోనున్న కొంత మంది అప్పుడే తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ తనను మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఎమ్మెల్యే స్థానానికి సైతం రాజీనామా చేసి వెళ్లిపోతానని హెచ్చరించారు.
14 మందికి ‘మంత్రి భాగ్య’......
ఇక 14 మంది ఎమ్మెల్యేలకు ‘మంత్రి భాగ్య’ను సీఎం సిద్ధరామయ్య కల్పించనున్నారు. మంత్రి వర్గంలో కొత్తగా చేరనున్న వారిలో రమేష్‌కుమార్ (శ్రీనివాసపుర), ప్రమోద్ మద్వరాజ్(ఉడుపి), ప్రియాంక్ ఖర్గే(చిత్తాపుర), బసవరాజ రాయరెడ్డి(యలబుర్గా), ఎస్.ఎస్.మల్లికార్జున్ (దావణగెరె ఉత్తర), కాగోడు తిమ్మప్ప (సాగర), రుద్రప్ప లమాణి (హావేరి), ఎం.కృష్ణప్ప (విజయనగర), రమేష్ జారకీహోళీ (గోకాక్), ఈశ్వర్ ఖండ్రే (బాల్కీ), హెచ్.వై.మేటి (బాగల్‌కోటె), ఎన్.ఎ.హ్యారిస్ (శాంతినగర), తన్వీర్‌సేఠ్, ఎమ్మెల్సీ ఎం.ఆర్.సీతారామ్‌లకు మంత్రి పదవులు దక్కనున్నాయి. వీరంతా నేడు (ఆదివారం) రాజ్‌భవన్‌లో జరగనున్న కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.