
నవదంపతులకు విందు ఇస్తున్న కమల్‌హాసన్
తమిళనాడు, పెరంబూరు: ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులకు నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ తన ఇంటికి ఆహ్వానించి విందునిచ్చారు. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో ద్వారా మరింత పాపులర్ అయిన నటి సుజా వరూణి. ఈమె యువ నటుడు, శివాజీగణేశన్ మనవడు, రామ్‌కుమార్ కొడుకు శివకుమార్ చాలా కాలంగా ప్రేమించుకుంటూ వచ్చారు. వీరి ప్రేమ పెళ్లి పీటలెక్కింది. ఇటీవల చెన్నైలో శివకుమార్, సుజా వరూణిల వివాహం జరిగింది. పలువురు సినీ ప్రముఖులు హాజరై నవ వధూవరులను ఆశ్వీదించారు. అంతకుముందే నటి సుజా వరూణి బిగ్‌బాస్ గేమ్ షోలో పాల్గొన్న సమయంలో తాను చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయానని, ఆయన స్థానంలో నటుడు కమలహాసన్‌ను చూసుకుంటున్నానని అన్నారు.
తన పెళ్లిని కమలహాసన్ తండ్రి స్థానంలో నిలబడి నిర్వహించాలని ఆశ పడుతున్నానన్న కోరికను ఆయన ముందుంచింది. అందుకు కమల్ కూడా అంగీకరించారు. అయితే ఇటీవల గజ తుపాన్ బాధితులను పరామర్శించడంలో తలమునకలైన కమలహాసన్ శివకుమార్, సుజా వరూణిల పెళ్లికి హాజరు కాలేకపోయారు. దీంతో కమల్ తుపాన్ బాధితులకు సహాయకార్యక్రమాలను పూర్తి చేసుకుని ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు. బుధవారం నవదంపతులు శివకుమార్, సుజావరూణిలను కమల్ తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించి వారికి మంచి బిరియానీ విందునిచ్చారు. ఈ విందులో నటి, మక్కళ్ నీది మయ్యం పార్టీ సభ్యరాలు శ్రీప్రియ, నటుడు నాజర్ సతీమణి కమీల పాల్గొన్నారు.