మొదటి మెట్టుమీదే ఉన్నా..

మొదటి మెట్టుమీదే ఉన్నా..


ముంబై: ‘నేనింకా మొదటి మెట్టుమీదే ఉన్నా.. ఇప్పుడే శిఖరం అంచుపైన దృష్టిపెడితే కిందపడిపోయే ప్రమాదం ఉంది కదా.. అందుకే నిదానంగా పైకి వెళతా..’ అంటోంది బాలీవుడ్ నటి కృతిసనన్. తాను నటించిన హిందీ సినిమా ‘హీరోపంతి’ సూపర్‌హిట్ కావడంతో ఇప్పుడు ఆమె టాక్ ఆఫ్ ది బాలీవుడ్‌గా మారిపోయింది.

 తాను ఇప్పటివరకు రెండు సినిమాలే చేశానని, ఒకటి బాలీవుడ్‌లో ‘హీరోపంతి’ కాగా, రెండోది తెలుగు సినిమా అని చెప్పింది. ’హీరోపంతి’ తామనుకున్న దానికన్నా పెద్ద హిట్ అవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది.‘దీంతోనే నేనేదో సాధించేశానని పొంగిపోలేను.. నేనింకా ఆరంభదశలోనే ఉన్నా.. సాధించాల్సింది చాలా ఉంది.ఇప్పుడే  నేను ఏదో సాధించేశానని అనుకుంటే ఇక్కడితో నా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసుకున్నట్లే..’ అని ఆమె స్పష్టం చేసింది. తన మీద అంచనాలనేవి ప్రజలు దృష్టిలో పెరగాలి తప్ప తనకు తానుగా పెంచుకోకూడదని తెలుసునంది. ‘ఇప్పుడిప్పుడే కెరీర్‌లో బిజీగా మారుతున్నా.. దానికనుగుణంగానే నా ఆలోచనాసరళి కూడా కొంచెం మార్చుకుంటున్నా. మొదటి అడుగులోనే విజయం సాధించినంతమాత్రాన తర్వాత అన్ని అంచనాలు ఒకేలా ఉంటాయనుకోవడం భ్రమే అవుతుంది. ‘మన హెయిర్‌స్టైల్ మార్చామనుకోండి.. మనలో భౌతికంగా కొంత మార్పు కనిపిస్తుంది కదా.. అంతమాత్రాన మనం మానసికంగా కూడా మారిపోయామనుకోవడం కరెక్ట్ కాదు..’ అని ఆమె స్పష్టం చేసింది. నేను ఈ సినిమా పరిశ్రమకు కొత్తదాన్ని. గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు.. అందుకే నేను వ్యక్తిగతంగా చాలామంది ప్రొడ్యూసర్లను కలిశా.. నా గురించి వివరించా.. అదృష్టవశాత్తు నా మొదటి నిర్మాత సాజిద్ నాదియావాలా నన్ను, టైగర్ షరాఫ్‌ను కన్నబిడ్డల్లా చూసుకున్నారు..’ అని చెప్పింది. సాజిద్‌తో మూడు సినిమాలకు చేసేందుకు కృతిసనన్ ఒప్పందం చేసుకుంది. అయితే నేను బయట సినిమాలకు కూడా చేసేందుకు సాజిద్ సార్ అంగీకరించారని ఆమె పేర్కొంది.తెలుగులో తాను సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో నటించిన మొదటి సినిమా ‘నేనొక్కడినే’ యావరేజ్‌గా నడిచింది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా రెండో సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ప్రస్తుతం ‘హీరోపంతి’ విజయం తర్వాత తన మొదటి ప్రాధాన్యత బాలీవుడ్‌కే ఇస్తానని ముక్తాయించింది ఈ అందాల సుందరి.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top