రాష్ట్రంలో భారీ వర్షాలు, సేలంలో గోడకూలి ముగ్గురి మృతి | Heavy rains in tamilnadu, Wall collapse three died in saleem | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో భారీ వర్షాలు, సేలంలో గోడకూలి ముగ్గురి మృతి

Oct 10 2013 2:39 AM | Updated on Sep 1 2017 11:29 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటించింది.

చెన్నై, సాక్షి ప్రతినిధి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటించింది. సేలంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ముగ్గురు మృతి చెందారు. అండమాన్ దీవులకు తూర్పు వైపు ఏర్పడిన అల్పపీడనం తమిళనాడుకు ఆగ్నేయంగా 1500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో మరో 22 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల తర్వాత, మరో 15 రోజుల్లో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
 
సేలంలో ముగ్గురి మృతి
ఇదిలా ఉండగా సేలం జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటి గోడ కూలిపోరుు ముగ్గురు మృతిచెందారు. సేలంలోని 9 వార్డు రామమూర్తి పుదూర్ నగర్‌లో శ్రీనివాసన్ (60), అతని భార్య కళ్యాణి (52), కుమారులు ధనపాల్ (35), బాబు (30), సెల్వరాజ్ (25), కుమార్తె జానకి (25), మనుమలు, మనుమరాండ్రతో పురాతన ఇంటిలో నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటిగోడ కూలిపోయింది. శ్రీనివాసన్, ఆయన కుమార్తె జానకి, మనుమరాలు నందిని గోడ శిథిలాల కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలినవారిని ఆస్పత్రిలో చేర్పించారు.
 
అగ్నిమాపక సిబ్బందికి సెలవులు నిషేధం
రాష్ట్రంలోని వివిధ కారణాల దృష్ట్యా నాలుగు నెలలు సెలవులు పెట్టరాదని అగ్నిమాపక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాల సమయంలో ఇళ్లు కూలడం, పిడుగుపాటు ప్రమాదాలు వంటివి చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే విజయదశమి, ఆయుధపూజ, దీపావళి, క్రిస్మస్ పండుగ రోజుల్లో బజార్లన్నీ రద్దీగా మారుతాయని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో అగ్నిమాపక శాఖలోని అధికారులు మొదలుకుని అటెండర్ వరకు 7 వేల మంది పనిచేస్తుండగా, ఈ కారణాల దృష్ట్యా ఈ నెల కలుపుకుని నాలుగు నెలలు వీరంతా సెలవులు పెట్టరాదని షరతు విధించింది. దీపావళి పండుగ ముగిసే వరకు ఈ షరతును కచ్చితంగా పాటించాలని, ఆ తర్వాత పరిస్థితులను అనుసరించి సడలించే అవకాశం ఉందని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement