మెడికల్‌ సీట్లు.. వసూళ్లు కోట్లు

Fraud In MBBS Seats karnataka - Sakshi

 బెంగళూరులో భారీ కుంభకోణం  

ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పిస్తామని 40 మందికి రూ. 5 కోట్లు టోపీ

పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు

బనశంకరి: బెంగళూరు నగరంలో భారీ మెడికల్‌ సీట్ల కుంభకోణం బయటపడింది. ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పిస్తామని నమ్మించిన నకిలీ సంస్థలు, వ్యక్తులు 40 మందిని రూ.5 కోట్ల వరకు మోసగించినట్లు వెలుగుచూసింది. ఇలాంటి బాగోతాలపై ఈ నెల రోజుల్లో బెంగళూరులోని వివిధ పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. వంచకుల మాయలో పడిన 40 మందికిపైగా విద్యార్థుల తల్లిదండ్రులు భారీమొత్తాల్లో డబ్బులు ముట్టజెప్పుకున్నారు. ఎంబీబీఎస్‌ కోర్సులకు ప్రవేశం కోసం  కౌన్సెలింగ్‌లో సీటు పొందలేని విద్యార్థులకు మేనేజ్‌మెంట్‌ కోటాలో సీటు ఇప్పిస్తామని కొన్ని నకిలీ సంస్థలు, వ్యక్తులు... తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి తలా రూ.10 లక్షలకు పైగా వసూళ్లకుకు పాల్పడ్డారు. ఆ తరువాత పత్తా లేకుండా పోయారు. 

దందా ఇలా  
ఎంబీబీఎస్‌ కోర్సుల ప్రవేశ ప్రక్రియ సమయంలో వంచక ముఠాలు అమాయకులకు వలవేశాయి. గత నెలరోజుల నుంచి బెంగళూరులోని వివిధ పోలీస్‌స్టేషన్లలో మెడికల్‌ సీట్లు వంచన కేసుల పట్ల పలు ఫిర్యాదులు అందగా వంచకుల కోసం గాలిస్తున్నామని సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ డీసీపీ దేవరాజ్‌ తెలిపారు. ఈ గ్యాంగ్‌లు అత్యాధునిక పరిజ్ఞానంతో అమాయకులకు వల విసురుతుంటారని తెలిపారు. టెలి కాలర్లు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా మెడికల్‌ కాలేజీల పాలకమండలి కోటాల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఇప్పిస్తామని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వద్ద నుంచి డబ్బు వసూలుకు పాల్పడుతున్నారని తెలిపారు. ముఠా నకిలీ పత్రాలు, గుర్తింపు కార్డులతో ప్రత్యేక బ్యాంకు అకౌంట్లు తెరుస్తారు. ఎక్కువసార్లు నేరుగా నగదే తీసుకుంటారు. 

పెద్దలూ కుమ్మక్కు?  
ఈ కేసుల్లో మెడికల్‌ కాలేజీ ఉద్యోగులు, పాలక మండలి పెద్దలతో వంచకులకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు తమ పేర్లు బయటికి రాకుండా బ్రోకర్లతో పని నడిపిస్తుంటారు. కొన్ని కాలేజీలు కూడా పాలకమండలి కోటాను భర్తీ చేయడానికి దళారులను సంప్రదించిన ఉదంతాలు ఉన్నాయి.  పలు కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను పారదర్శకంగా భర్తీ చేస్తున్నా, కొన్ని విద్యాసంస్థల పాలకమండలి కోటాలో ఉన్న సీట్లను బ్రోకర్ల ద్వారానే కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కాగా ఈ కేసుల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top