కలాం మృతితో దిగ్భ్రాంతి | Sakshi
Sakshi News home page

కలాం మృతితో దిగ్భ్రాంతి

Published Tue, Jul 28 2015 3:21 AM

కలాం మృతితో దిగ్భ్రాంతి

 సాక్షి, చెన్నై : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం మృతితో రాష్ర్టంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన సొంత గ్రామంలో ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. రామనాథపురం జిల్లా రామేశ్వరంలో జైనులుద్దీన్, ఆషిమా దంపతుల ఇంట 1931 అక్టోబర్ 15న కలాం జన్మించారు. కడుపేదరికంలో పుట్టిన ఆయన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం రామనాథపురంలో సాగింది. తిరుచ్చిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో కళాశాల విద్యాభ్యాసం సాగింది. మద్రాసు వర్సిటీలో ఉన్నత విద్యాభాస్యం సాగింది. శాస్త్రవేత్తగా అవతరించిన ఆయన భారత రాష్ట్రపతిగా అత్యున్నత స్థానాన్ని అధిరోహించారు.
 
 ‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ అంటూ నేటితరం విద్యార్థులకు ఒక మార్గదర్శిగా నిలిచారు. తమిళుల ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటినకలాంకు సొంత గడ్డ అంటే ఎనలేని మక్కువ. తన స్వగ్రామమంటే ఎంతో ఇష్టం. తమిళనాడులో తరచూ పర్యటించే ఆయన్ను కలుసుకునేం దుకు ఇక్కడి విద్యార్థి లోకం ఉత్సాహం చూపుతుంది. అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ, సమయానుకూలంగా తమిళంలోనే ఎక్కువసార్లు మాట్లాడడం కలాం నైజం. అలాంటి మహనీయుడు ఇక లేరు అన్న సమాచారంతో తమిళులు తమ సొంత బిడ్డను కోల్పోయినంత ఆవేదనలో మునిగారు. రామేశ్వరంలో ప్రతి ఇంటా విషాదం నెలకొంది.
 
 నేడు పాఠశాలలకు సెలవు
 కలాం మరణంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఇళంగోవన్, డీఎండీకే నేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో, పీఎంపీ నేత జీకే.వాసన్, వీసీకే నేత తిరుమావళవన్‌తో పాటు మైనారిటీ సంఘాల నేతలు సంతాపం తెలియజేశారు. కలాం సేవలను స్మరించుకున్నారు.
 
 గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయాం
 ప్రపంచం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయామని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. కలాం లేరన్న సమాచారం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. శాస్త్రవేత్తగానే కాకుండా పరిపాలనాధక్షుడిగా రాణించారని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ అవిశ్రాంతంగా ఆయన సేవలు అందించారని కొనియాడారు. ఆ మహనీయుడు ఆత్మకు శాంతి కలగాలని కోరారు.

Advertisement
Advertisement