breaking news
nation mourns
-
కలాం మృతితో దిగ్భ్రాంతి
సాక్షి, చెన్నై : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం మృతితో రాష్ర్టంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన సొంత గ్రామంలో ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. రామనాథపురం జిల్లా రామేశ్వరంలో జైనులుద్దీన్, ఆషిమా దంపతుల ఇంట 1931 అక్టోబర్ 15న కలాం జన్మించారు. కడుపేదరికంలో పుట్టిన ఆయన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం రామనాథపురంలో సాగింది. తిరుచ్చిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో కళాశాల విద్యాభ్యాసం సాగింది. మద్రాసు వర్సిటీలో ఉన్నత విద్యాభాస్యం సాగింది. శాస్త్రవేత్తగా అవతరించిన ఆయన భారత రాష్ట్రపతిగా అత్యున్నత స్థానాన్ని అధిరోహించారు. ‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ అంటూ నేటితరం విద్యార్థులకు ఒక మార్గదర్శిగా నిలిచారు. తమిళుల ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటినకలాంకు సొంత గడ్డ అంటే ఎనలేని మక్కువ. తన స్వగ్రామమంటే ఎంతో ఇష్టం. తమిళనాడులో తరచూ పర్యటించే ఆయన్ను కలుసుకునేం దుకు ఇక్కడి విద్యార్థి లోకం ఉత్సాహం చూపుతుంది. అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ, సమయానుకూలంగా తమిళంలోనే ఎక్కువసార్లు మాట్లాడడం కలాం నైజం. అలాంటి మహనీయుడు ఇక లేరు అన్న సమాచారంతో తమిళులు తమ సొంత బిడ్డను కోల్పోయినంత ఆవేదనలో మునిగారు. రామేశ్వరంలో ప్రతి ఇంటా విషాదం నెలకొంది. నేడు పాఠశాలలకు సెలవు కలాం మరణంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఇళంగోవన్, డీఎండీకే నేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో, పీఎంపీ నేత జీకే.వాసన్, వీసీకే నేత తిరుమావళవన్‌తో పాటు మైనారిటీ సంఘాల నేతలు సంతాపం తెలియజేశారు. కలాం సేవలను స్మరించుకున్నారు. గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయాం ప్రపంచం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయామని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. కలాం లేరన్న సమాచారం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. శాస్త్రవేత్తగానే కాకుండా పరిపాలనాధక్షుడిగా రాణించారని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ అవిశ్రాంతంగా ఆయన సేవలు అందించారని కొనియాడారు. ఆ మహనీయుడు ఆత్మకు శాంతి కలగాలని కోరారు. -
ఓ మహాత్మా, మహర్షీ..
తన అద్భుత ఆలోచనలతో యువతను మేలుకొలిపిన అభినవ వివేకానందుడు కలాం. ఆయన ఆకస్మిక మృతి జిల్లా వాసులను కలచి వేసింది. జిల్లాతో ఆయనకున్న అనుబంధాన్ని విద్యాధికులు, రాజకీయవేత్తలు, విద్యార్థులు స్మరించుకుని నివాళులర్పించారు. ఎక్కడో మారుమూల శ్రీకాకుళం జిల్లాకు సైతం నాలుగేళ్ల క్రితం ఆయన తరలివచ్చి ఇక్కడి విద్యార్థిలోకాన్ని ప్రభావితం చేసేలా ఆయన ప్రబోధించిన తీరు నభూతో.. రాజాంలో జీఎంఆర్ ఐటీలో సుదీర్ఘమైన ఆ ఉపన్యాసం ఆ ప్రాంగణంలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆనాడు వేదికపై గంభీరమైన, ఆలోచనాత్మమైన, విజ్ఞానప్రపూర్ణమైన ఆయన మాటలు ఎన్నటికీ మరువలేనివి. ఆరోజు అక్కడ కాలేజీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలోని ప్రతి అంశాన్ని పరిశీలించి ప్రశంసించారు. రాజాం: కలలు కనండి... సాకారం చేసుకోండి... అంటూ యువతను ప్రభావితం చేసిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాంకు శ్రీకాకుళం జిల్లాతోనూ అనుబంధం ఉంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్రంధి మల్లిఖార్జునరావు రాజాంలో స్థాపించిన జీఎంఆర్‌ఐటీలో 2009 మార్చి 12న నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శాస్త్ర సంకేతిక రంగాల్లో దేశానికి ఎన్నో విజయాలు అందించిన ఆయన రాజాం జీఎంఆర్‌ఐటీకి రావడం ఒక చారిత్రక సంఘటనగానే చెప్పుకోవచ్చు. జీఎంఆర్ ఆహ్వానం మేరకు ఇంజినీరింగ్ పట్టభద్రులకు, అధ్యాపకులకు, శాస్త్ర సాంకేతిక శాస్త్రవేత్తలకు దిశా నిర్దేశం చేసే విధంగా ఆయన కీలక ఉపన్యాసం చేశారు. ఆయన వస్తున్నారని తెలియగానే జీఎంఆర్ విద్యాసంస్థలకు సంబంధించిన విద్యార్థులతో పాటు ఇతరత్రా విద్యార్థులు పాల్గొని ఆయన ఉపన్యాసంతో స్ఫూర్తి పొందారు. అనంతరం ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో రాజాంలోని పలు విద్యాసంస్థలు నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన పలు సృజనాత్మకత అంశాలను ఆసక్తిగా పరిశీలించి అభినందించారు. సోమవారం ఆయన మృతి పట్ల జీఎంఆర్‌ఐటీ సిబ్బందితో పాటు విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.