అనువాద (డబ్బింగ్) చిత్రాలను అనుమతించే విషయమై కన్నడ చిత్ర పరిశ్రమ రెండుగా చీలింది. డబ్బింగ్ చిత్రాలను ఎట్టి పరిస్థితుల్లో...
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అనువాద (డబ్బింగ్) చిత్రాలను అనుమతించే విషయమై కన్నడ చిత్ర పరిశ్రమ రెండుగా చీలింది. డబ్బింగ్ చిత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని ఓ బలమైన వర్గం గట్టిగా వాదిస్తుండగా, ఇతర భాషల్లో వచ్చే మంచి చిత్రాలను చూసే స్వేచ్ఛ ప్రేక్షకులకు ఉండాలన్నది మరో వర్గం దృఢాభిప్రాయం. ఈ నేపథ్యంలో డబ్బింగ్‌కు వ్యతిరేకంగా సోమవారం కన్నడ చిత్ర పరిశ్రమ బంద్‌కు వాటాళ్ నాగరాజ్ పిలుపునిచ్చారు. కన్నడ చళువళి వాటాళ్ పక్ష తరఫున ఆయన భాషా, సంృ్కతులపై పోరాటాలు చేస్తూ ఉంటారు.
కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సంఘం ఈ బంద్‌ను వ్యతిరేకిస్తోంది. కళాకారులు మాత్రం బంద్‌కు సంపూర్ణ మద్దతునిస్తున్నారు. సీనియర్ నటుడు శివ రాజ్‌కుమార్ డబ్బింగ్ చిత్రాలను అనుమతించనే కూడదని కుండ బద్ధలు కొట్టారు. భాషతో వ్యాపారం చేయకూడదనేది ఆయన నిశ్చితాభిప్రాయం. తమ సామర్థ్యంపై నమ్మకం లేని వారే డబ్బింగ్ చిత్రాల వైపు మొగ్గు చూపుతారని ఎద్దేవా చేశారు. కూలీ పనులు చేసైనా కుటుంబాన్ని పోషించుకుంటామే తప్ప, డబ్బింగ్‌ను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
బంద్‌లో రవిచంద్రన్, సుదీప్, దర్శన్, పునీత్, విజయ్, యశ్ సహా కళాకారులందరూ పాల్గొంటారని తెలిపారు. డబ్బింగ్ చిత్రాల వల్ల కన్నడ చిత్ర పరిశ్రమకు ఏ విధంగానూ ఉపయోగం లేదని మరో నటుడు జగ్గేశ్ చెబుతున్నారు. అయితే డబ్బింగ్ సినిమాలు కావాలా.. వద్దా అనే నిర్ణయాన్ని ప్రేక్షకుల విజ్ఞతకే వదిలివేయాలన్నది దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబు అభిప్రాయం. ఇతర భాషల సినిమాలు ఎలా ఉంటాయో చూడాలన్న కుతూహలం కన్నడిగుల్లో ఉండడం సహజమని అన్నారు.
అలాంటి వారికి అవకాశం ఇచ్చి తీరాలన్నారు. భాష, సంృ్కతులకు హాని కలుగుతుందనే నెపంతో ప్రముఖ దర్శకుల సినిమాలను కన్నడ సినీ ప్రియులు చూడకుండా అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. ‘అవసాన దశలో ఉన్న మరాఠీ చిత్ర రంగం డబ్బింగ్‌ను అనుమతిస్తోంది. డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఏటా రూ.వంద కోట్ల వ్యాపారం జరుగుతోంది’ అని ఆయన వివరించారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ చంద్రశేఖర కంబార సైతం డబ్బింగ్ చిత్రాలకు అనుకూలంగానే ఉన్నారు.