డ్రైవర్ తప్పిదం వల్లే.. | Failed breaks local train accident | Sakshi
Sakshi News home page

డ్రైవర్ తప్పిదం వల్లే..

Jul 10 2015 1:09 AM | Updated on Sep 3 2017 5:11 AM

డ్రైవర్ తప్పిదం వల్లే..

డ్రైవర్ తప్పిదం వల్లే..

చర్చిగేట్ రైల్వే స్టేషన్‌లో లోకల్ రైలు ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది...

- చర్చిగేట్ స్టేషన్‌లో లోకల్ రైలు ప్రమాదం
- ప్రాథమిక దర్యాప్తులో తేల్చిన రైల్వే సాంకేతిక బృందం
- విచారణ జరుపుతున్న ప్రత్యేక కమిటీ
సాక్షి, ముంబై:
చర్చిగేట్ రైల్వే స్టేషన్‌లో లోకల్ రైలు ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే బ్రేక్ ఫెయిల్ అయినట్లు చిత్రీకరించేందుకు మోటర్‌మాన్ (డ్రైవర్) క్యాబిన్‌లోకి ఓ డ్రైవర్ చొరబడి మరో సిబ్బంది సహాయంతో బ్రేక్ పరికరాలను పాడు చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే క్యాబిన్‌లోకి ఎందుకు వెళ్లారో తెలుసుకునేందుకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు స్టేషన్ జనరల్ మేనేజర్ సునీల్‌కుమార్ సూద్ చెప్పారు.

జూన్ 28 మధ్యాహ్నం చర్చిగేట్ స్టేసన్‌లో లోకల్ రైలు బఫ్ఫర్ స్టాపర్లను ఢీకొని ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మోటర్‌మాన్ సహా నలుగురు గాయపడ్డారు. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు పశ్చిమ రైల్వే పరిపాలనా విభాగం ప్రత్యేకంగా నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇంకా విచారణ జరుపుతోంది. నివేదిక ఇంకా రావాల్సి ఉంది. అయితే అంతకు ముందుగానే రైల్వే సాంకేతిక బృందం జరిపిన ప్రాథమిక దర్యాప్తులో ఇంకా పలు వాస్తవాలు వెలుగుచూశాయి.
 
మాటల్లో పడి..?
రద్దీ సమయంలో డ్రైవర్ క్యాబిన్‌లో ముగ్గురు, నలుగురు సిబ్బంది లోకల్ రైలు ప్రయాణిస్తుంటారు. ఈ సందర్భంగా వారితో మాటల్లో పడి డ్రైవర్ రైలును నియంత్రించలేక పోయాడా, ప్రమాదం జరిగిన రోజు క్యాబిన్‌లో మరెవరైనా సిబ్బంది ప్రయాణించారా, అనే కోణంలో ప్రత్యేక కమిటీ దర్యాప్తు జరుగుతోంది. స్టేషన్‌లో అమర్చిన బఫ్ఫర్ స్టాపర్లు చాలా ఏళ్ల కిందట ఏర్పాటు చేసినవి. కొత్తగా వచ్చిన లోకల్ రైళ్లన్నీ కొంచెం ఎక్కువ ఎత్తు ఉన్నాయి. దీంతో చర్చిగేట్‌లో ఉన్న బఫ్ఫర్ స్టాపర్లు, కొత్త రైళ్లకు అమర్చిన బఫ్ఫర్ స్టాపర్ల మధ్య చాలా వ్యత్యాసం ఏర్పడింది. సాధారణంగా బఫ్ఫర్ స్టాపర్‌ను ఢీ కొన్న తరువాత కొంత వెనక్కి వెళ్లి రైలు ఆగిపోవాలి. కాని అవి సమాంతరంగా లేకపోవడం వల్ల ఆ రోజు వేగంగా వచ్చిన రైలు వాటిని ఢీ కొన్ని ఏకంగా ప్లాట్‌ఫాంపైకి ఎక్కేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement