అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీలు హోరాహోరీగా తలపడిన ఏర్కాడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో విజేత ఎవరో ఆదివారం తేలిపోనుంది.
= నేడే ఓట్ల లెక్కింపు
= ఉదయం 11 గంటలకు ఫలితాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి : అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీలు హోరాహోరీగా తలపడిన ఏర్కాడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో విజేత ఎవరో ఆదివారం తేలిపోనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమై 11 గంటలకల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
అన్నాడీఎంకే తరపున సరోజ, డీఎంకే తరపున నాగమారన్ అభ్యర్థులుగా నిలిచారు. స్వతంత్ర అభ్యర్థులుగా మరో 9 మంది పోటీపడ్డారు. సీఎం జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డారు. సీఎం జయ, డీఎంకే తరపున పార్టీ కోశాధికారి స్టాలిన్, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి ప్రచారం చేశారు. ఈనెల 4వ తేదీన పోలింగ్ పూర్తయింది. నియోజకవర్గంలో మొత్తం 2,40, 290 ఓటర్లు ఉండగా, 2,14, 434 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ పూర్తికాగానే సేలం అస్తంపట్టిలోని సీఎస్‌ఐ పాలిటెక్నిక్ కళాశాలలో ఈవీఎంలను భద్ర పరిచారు. 186 మంది కేంద్ర భద్రతా దళాలతోపాటూ తమిళనాడు పోలీసులు రేయింబవళ్లు ఈవీఎంల రూములను కాపలా కాశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 179 ఓట్లు పోలైనట్లు గుర్తించారు. ఎన్నికల పర్యవేక్షకులు రవిప్రకాష్ అరోరా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మకరభూషణం, నియోజకవర్గ ఎన్నికల అధికారి సభాపతి నేతృత్వంలో ఉదయం 8 గంటలకు లెక్కింపును ప్రారంభించనున్నారు. 11 టేబుళ్లపై 21 రౌండ్లలో లెక్కింపు ప్రారంభిస్తారు.
ఒక్కో రౌండ్‌కు 15 నుంచి 20 నిమిషాలు పట్టే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ లెక్కన 11 గంటలకు లెక్కింపు పూర్తయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 12 గంటలకు అధికారికంగా ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బంది ఉదయం 6 గంటలకల్లా లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని, ఎన్నికల కమిషన్ జారీచేసిన గుర్తింపుకార్డును వారివెంట తప్పనిసరిగా తెచ్చుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మకరభూషణ్ తెలిపారు. సిబ్బంది తమ వెంట సెల్‌ఫోన్, పెన్ తెచ్చుకోరాదని ఆయన చెప్పారు.