
ఓస్లో: ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి మరియా కొరనీ మచాడోను వరించింది. వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కల కోసం పోరాడినందుకు గానూ నార్వే నోబెల్ కమిటీ ఆమెకు ఈ బహుమతి అందిస్తున్నట్లు తెలిపింది.
ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన నోబెల్ శాంతి పురస్కారం పొందిన గ్రహితలకు అందే ప్రొత్సహకాలపై చర్చ మొదలు కాగా.. వాటి వివరాలు నోబెల్ పీస్ ప్రైజ్ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. వాటి ఆధారంగా ఎవరైతే నోబెల్ శాంతి బహుమతి పొందారో వారికి ప్రైజ్ మనీ కింద 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ (SEK) అందుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ.102 కోట్లు పైచీలుకు మొత్తాన్ని దక్కించుకోవచ్చు.
స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ కోరిక మేరకు 1901 నుంచి అవార్డుల ఇవ్వడం ప్రారంభమైంది. మానవాళికి ప్రయోజనం చేకూర్చుతూ పాటుపడిన శాంతి, సాహిత్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, ఆర్థిక శాస్త్రాలు ఆరురంగాల వారికి అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తన మరణానికి ఒక సంవత్సరం ముందు, 1895 నవంబర్ 27న తన వీలునామాపై సంతకం చేసిన ఆల్ఫ్రెడ్ నోబెల్, తన సంపదలో ఎక్కువ భాగాన్ని, SEK 31 మిలియన్లకు పైగా (నేడు సుమారు SEK 2.2 బిలియన్లు) సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి నుంచి వచ్చిన ఆదాయాన్ని ఏటా మానవాళికి గణనీయంగా ప్రయోజనం చేకూర్చిన వారికి బహుమతులుగా పంపిణీ చేసేలా వీలునామాలో పేర్కొన్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ఆధారంగా పైన పేర్కొన్న ఆరు రంగాల్లో విశేష కృషి చేసినందుకు నోబెల్ బహుమతి అందివ్వడం ఆనవాయితీగా వస్తుంది. నోబెల్ బహుమతి పొందిన వారికి భారీ మొత్తంలోప్రైజ్ మనీ దక్కనుంది.
పతకం రూపకల్పన
నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని నార్వేజియన్ శిల్పి గుస్తావ్ విజిలాండ్, స్వీడిష్ శిల్పి ఎరిక్ లిండ్‌బర్గ్ సహకారంతో రూపొందించారు. ఈ పతకం మొదట 1902లో అవార్డు వేడుకలో ఉపయోగించారు.
ఆరంభంలో..23-క్యారెట్ బంగారంతో తయారు చేశారు. బరువు 192 గ్రాములు
1980 తర్వాత.. 18 క్యారెట్ బంగారంగా మార్చారు. బరువు కొద్దిగా పెరిగి 196 గ్రాములు అయ్యింది.
వ్యాసం: 6.6 సెంటీమీటర్లు ఇది స్థిరంగా ఉంది.
పతకం రూపం,చిహ్నాలు:
నోబెల్ ప్రైజ్ ముందు భాగం
ఆల్ఫ్రెడ్ నోబెల్ పోర్ట్రెయిట్
ఆయన పేరు, జనన తేదీ, మరణ సంవత్సరం
వెనుక భాగం:
ముగ్గురు నగ్న పురుషులు కౌగిలించుకున్న దృశ్యం
ఇది అంతర్జాతీయ సోదరభావానికి చిహ్నం
లాటిన్ శాసనం: Pro pace et fraternitate gentium ‘ప్రజల మధ్య శాంతి, సోదరభావం కోసం’
అంచు:
5 మిల్లీమీటర్ల మందపాటి అంచు చుట్టూ
సంవత్సరం, అవార్డు గ్రహీత పేరు చెక్కబడి ఉంటుంది
ఈ పతకం రూపకల్పన, దాని చిహ్నాలు, దాని వెనుక ఉన్న భావన నోబెల్ శాంతి బహుమతికి ఉన్న ఆధ్యాత్మికత, గౌరవం, ప్రపంచ శాంతికి అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి.