చిటికెలో... తుఫాన్‌ సమాచారం!

Cyclone Information From Emergency Operation Center - Sakshi

భోగాపురం(నెల్లిమర్ల): ప్రకృతి ప్రకోపంవల్ల కలిగే నష్టం అంతా ఇంతా కాదు. హుద్‌హుద్‌ తుఫాన్‌ వంటి విపత్తులు సృష్టించిన బీభత్సం ఇప్పటికీ ప్రజ ల మదిలో మెదులు తూనే ఉంది. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు జాతీయ విపత్తుల నివారణ ప్రాధికారిక సంస్థ ముందస్తుగానే ప్రమాదాలను గుర్తించి అధికారులను సమాయత్తం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. విపత్తుల ద్వారా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకుండా అరికట్టేందుకు తీరప్రాంతాలున్న జిల్లాలు, మండలాల్లో ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్లను ప్రారంభిస్తోంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనావేసి అక్కడ ఉండే అధికారులు, ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ఈ సెంటర్లు పనిచేస్తాయి. ఇస్రో, నాసా, ఐఎండీ, ఐఐఆర్‌ఎస్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు సహా అంతరిక్షం అందించే సమాచారాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సేకరించి ఆ విషయాన్ని సంబంధిత శాఖలకు త్వరితగతిన పంపే ఏర్పాట్లు చేస్తోంది.

వాతావరణ శాఖపై ఆధారపడకుండా...
ఇప్పటివరకూ తుఫాన్‌లు సంభవించినప్పుడు వాతావరణ శాఖ అధికారులు సంబంధిత మండలాలకు హెచ్చరికలు జారీ చేసేవారు. తుఫాన్‌ ప్రభావం ఉన్న జిల్లాలు, మండలాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు  తీవ్రతపై సమాచారాన్ని వైర్‌లెస్‌ సెట్లు, ఇంటర్‌నెట్‌ మాధ్యమాల ద్వారా చేరవేసేవారు. ఆ హెచ్చరికల మేరకు తీరప్రాంత మండలాల్లో అధికారులు అప్రమత్తమై తీరానికి ఆనుకుని ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేవారు. ఇకపై వాతావరణ శాఖ అధికారులతో సంబంధం లేకుండా తీర ప్రాంతాలున్న జిల్లాల్లో డీఈఓసీ(జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌), మండలాల్లో ఎంఈఓసీ(మండల్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌) లను విపత్తుల నిర్వహణా సంస్థ కొత్తగా ఏర్పాటుచేస్తోంది. రాష్ట్రంలో తీర ప్రాంతాలు కలిగి ఉన్న 9జిల్లాల్లో, 86మండలాల్లో వీటిని ఏర్పాటుచేస్తున్నారు.

స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌తో అనుసంధానం
విజయవాడ వద్ద గొల్లపూడిలో ఏర్పాటుచేసిన ఎస్‌ఈఓసీ (స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌) నుంచి డీఈఓసీ, ఎంఈఓసీలు అనుసంధానమై ఉంటాయి. ఎస్‌ఈఓసీలో సిబ్బంది 24గంటలూ శాటిలైట్‌కు అనుసంధానం చేసిన టీవీలు చూస్తూ తుఫానులు మాత్రమే గాకుండా ఏ గ్రామంలో, ఎక్కడ పిడుగులు పడబోతున్నాయో కూడా ముందుగా గ్రామంలోని వీఆర్‌ఓలకు ఫోన్‌ ద్వారా తెలియజేస్తారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే సమాచారం తెలుసుకుని దాన్ని జిల్లా కేంద్రానికి, వార్తా పత్రికలు, చానెళ్లకు కూడా సమాచారం అందిస్తుంటారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top