రెండు ఉపాధ్యాయ, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఈనెల 9న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ..
ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవం
రెండింటిలో బీజేపీ, మరో రెండింటిలో జేడీఎస్ విజయం
బెంగళూరు: రెండు ఉపాధ్యాయ, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఈనెల 9న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చుక్కెదురైంది. ఓట్ల లెక్కింపు సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. అనంతరం వెలువడిన ఫలితాల్లో నాలుగు స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి పరాభవం ఎదురైంది. మొత్తం నాలుగు స్థానాల్లో రెండింటిని బీజేపీ, మరో రెండింటిలో జేడీఎస్ విజయం సాధించింది. దక్షిణ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి జేడీఎస్ పార్టీ అభ్యర్థి కే.టీ శ్రీకంఠేగౌడ విజయం సాధించగా వాయువ్య గ్రాడ్యుయేట్ నియోజక వర్గంనుంచి బీజేపీ అభ్యర్థి హనుమంత నిరాణి గెలుపొందారు. దీంతో రెండు గ్రాడ్యుయేట్ నియోజక వర్గాలకు గాను ఒకటి బీజేపీ, మరొకటి జేడీఎస్ కైవసం చేసుకున్నట్లయ్యింది.
ఇక పశ్చిమ ఉపాధ్యాయనియోజక వర్గం నుంచి జేడీఎస్ పార్టీ తరఫున వరుసగా ఏడోసారి పోటీ చేసిన బసవరాజహొరట్టి గెలుపొందగా వాయువ్య ఉపాధ్యాయ నియోజక వర్గం నుంచి అరుణ్‌శాపుర గెలుపొందారు. దీంతో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగిన పోటీల్లో ఒకటి కలమ నాథులు చేజెక్కించుకోగా మిగిలిన స్థానాన్ని ‘దళం’ గెలుచుకుంది. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన వారిని ఆయా పార్టీల అధినేతలు అభినందించారు. ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో విజేతలుగా నిలిచిన పార్టీల కార్యకర్తలు పరస్పరం మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.