నిత్యం రద్దీగా ఉండే దాదర్ రైల్వేస్టేషన్‌ను పేల్చివేస్తామంటూ ఫోన్ రావడంతో పోలీసు శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.
సాక్షి, ముంబై: నిత్యం రద్దీగా ఉండే దాదర్ రైల్వేస్టేషన్‌ను పేల్చివేస్తామంటూ ఫోన్ రావడంతో పోలీసు శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ఫోన్ పుణేలోని రైల్వే పోలీసు కార్యాలయానికి బుధవారం ఉదయం వచ్చింది. బుధవారం సాయంత్రం దాదర్ రైల్వే స్టేషన్‌ను పేల్చివేస్తామంటూ అవతలి వ్యక్తి బెదిరించి ఫోన్ పెట్టేశాడు. ఈ విషయాన్ని పుణే రైల్వే పోలీసులు తక్షణమే దాదర్‌లోని కంట్రోల్ రూంకు చేరవేశారు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు నగర పోలీసులతో సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. దాదర్ స్టేషన్‌లోని పశ్చిమ, సెంట్రల్ మార్గాల్లో దాదాపు 15పైగా ప్లాట్‌ఫాంలున్నాయి. అంతటా పోలీసులను మోహరించి అణువణువూ గాలించారు. ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశారు. నగరంలో రద్దీగా ఉండే కీలక మూడు రైల్వే స్టేషన్లలో దాదర్ ఒకటి. ఫాస్ట్ లోకల్ రైళ్లు, దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లు ఆగుతాయి. దీంతో ఈ స్టేషన్ తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రిదాకా ప్రయాణికుల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉంటుంది.