ఎవరు చేసినా వైద్యమే.. | Sakshi
Sakshi News home page

ఎవరు చేసినా వైద్యమే..

Published Thu, Apr 19 2018 8:25 AM

Bobbili Hospital Doctors Negligence - Sakshi

ఈ చిత్రంలో కనిపిస్తున్న గర్భిణి పేరు మజ్జి శారద. తెర్లాం మండలం లింగాపురం. పురిటి నొప్పులు వస్తున్నాయని 108లో బొబ్బిలి ఆసుపత్రికి మంగళవారం వచ్చింది. అయితే ఇక్కడి నుంచి విజయనగరం వెళ్లి పురుడు పోయించుకోమని రిఫర్‌ లెటర్‌ రాసి ఈమె చేతిలో పెట్టారు. అలాగని ఇక్కడ సౌకర్యాల్లేవని అనుకోకండి! బొబ్బిలి సీహెచ్‌సీలో మతా,శిశు అత్యవసర సేవా విభాగం ప్రత్యేకంగా ఉంది. కానీ దీనిని వినియోగించే పరిస్థితులు లేవు. ఇక్కడ అధునాతన అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ సిస్టం కూడా పక్కనపెట్టేసి ఉంది. 

బొబ్బిలి ఆస్పత్రిలో ఎనిమిది మంది వైద్యులున్నారు. కానీ వైద్యం అందడం మాత్రం గగనమే! ముప్పై పడకల సీహెచ్‌సీగా ఉన్న ఈ ఆసుపత్రిని వంద పడకలు చేస్తామని గత నాలుగేళ్లుగా ప్రజాప్రతినిధులు ప్రకటిస్తూనే ఉన్నారు. స్థాయి మాట దేవుడెరుగు.. కనీసం వైద్యం అందినా సంతోషమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం సుమారు 300 మంది ఓపీ వస్తున్న ఈ ఆసుపత్రిలో అప్పటి కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి ఇచ్చిన వేడినీటిపంపిణీ విభాగం పడకేసింది. దీంతో వేడి నీరు కావాలంటే రోగులు పక్కనున్న హోటళ్లవైపు పరుగెత్తాల్సిందే. అలాగే ఏదేని రోగమొచ్చి ఆసుపత్రిలో చేరితే ఎక్స్‌రే కూడా బయటకెళ్లి తీసుకోవాల్సిందే.

డెప్యూటేషన్లు షురూ..
ఇక్కడ పలు పోస్టులను ఇష్టం వచ్చిన రీతిలో డెప్యుటేషన్లు వేస్తుంటారు. రాజకీయంగా పలుకుబడి ఉంటే ఇక్కడ పోస్టింగ్‌తో వేరెక్కడయినా పనిచేయొచ్చు. రోగులకే ఇబ్బందులు తప్పవు. కానీ పూర్తి స్థాయిలో వైద్యం అందాలంటే బొబ్బిలి ఆసుపత్రిని తప్పించి ఇంకెక్కడయినా ఆశ్రయించొచ్చు. వైద్యం కోసం ఇక్కడికి వచ్చి మరింత మెరుగైన వైద్యం కోసం ఇక్కడి నుంచి ఎక్కడికయినా వెళ్లాలంటే అంబులెన్స్‌ ఇబ్బందులు తప్పవు. 

పదిన్నర గంటలకు ఒక్కరూ లేరే..? 
మంగళవారం ఇక్కడికి మాజీ కౌన్సిలర్‌ షణ్ముఖరావు తదితరులు వైద్యం కోసం వచ్చారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి పదిన్నర వరకూ వేచి చూస్తే ఇద్దరు మాత్రమే ఇక్కడకు వచ్చారు. మిగతా వారు రాలేదు. ఆయా కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక ఇతర సిబ్బంది ఒక్కొక్కరుగా వస్తున్నారు. దీంతో ఆసుపత్రిలో చెట్ల కింద రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో మాజీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త మువ్వల శ్రీనివాసరావు, కన్నూరు శ్రీనివాసరావు తదితరులు అక్కడి ఫార్మసిస్టు వెంకటరమణకు లేఖ ఇచ్చి వెళ్లిపోయారు. నిర్ణీత సమయానికి వైద్యులు వచ్చేలా చూడాలని వారు ఆవేదన చెందారు.

వైద్య సిబ్బంది గైర్హాజరుపై ఫిర్యాదు.. 
 ఇంతలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ పెంట మోహనరావు రావడంతో ఆయనను ఆసుపత్రి సిబ్బంది తీరుపై ప్రశ్నించారు. త్వరలో ఆసుపత్రిని ప్రక్షాళన చేయనున్నామని, ప్రధాన వైద్యులు జి శశిభూషణరావు సెలవులో ఉన్నారనీ, ఆయన వచ్చాక పరిస్థితులు చక్కదిద్దుతామని చెప్పారు. మరో ప్రధాన వైద్యుడు ఎస్‌వీ సత్యశేఖర్‌ మాట్లాడుతూ తాను విజయనగరంలో సమావేశం నిమిత్తం వచ్చాననీ, వైద్యులంతా నిర్ణీత సమయానికి వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

బొబ్బిలి : ఈ చిత్రం చూడండి! ఇక్కడ ఇంజక్షన్‌ చేస్తున్న ఉద్యోగిని డాక్టరో లేక స్టాఫ్‌ నర్సో అనుకుంటే పొరపడినట్టే! ఈమె నైట్‌వాచ్‌మన్‌! పేరు పైడితల్లి! కానీ ఇక్కడ నిత్యం ఓపీ పెరిగిపోతుండటంతో వైద్యులు ఈమెను ఇంజక్షన్లు చేసేయమని ఆదేశాలు ఇచ్చేశారు. దీంతో ఈమె ఇక్కడ కూర్చుని వచ్చిన వారికి ఇంజక్షన్లు చేస్తుంటుంది. అలాగే బీపీ చూసేందుకు వైద్యులు, నర్సులు అందుబాటులో ఉండరు. ఈ ఆస్పత్రిని రాష్ట్ర గనుల శాఖా మంత్రి రెండు మూడు సార్లు పర్యటించి వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన ఆసుపత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఆసుపత్రిని వంద పడకల ఆసుత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు మొన్నటి జన్మభూమి సభలో ప్రకటించేశారు. కానీ ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి. 

1/1

ఓ మహిళకు ఇంజక్షన్‌ చేస్తున్న నైట్‌ వాచ్‌మన్‌ పైడితల్లి 

Advertisement
Advertisement