నగరానికి అవసరమైన రైల్వే పథకాల జాబితాను సిద్ధం చేశామని రైల్వే శాఖ మంత్రి డీవీ. సదానంద గౌడ తెలిపారు. అధికారులతో చర్చించి ఈ పథకాలను దశలవారీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
- బెంగళూరుకు రైల్వే పథకాలు రెడీ
 - దశల వారీగా అమలు చేస్తాం
 - ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాం
 - ఐదేళ్లలో సాధించబోయే ప్రగతిపై నివేదిక
 - రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ వెల్లడి
 
	సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరానికి అవసరమైన రైల్వే పథకాల జాబితాను సిద్ధం చేశామని రైల్వే శాఖ మంత్రి డీవీ. సదానంద గౌడ తెలిపారు. అధికారులతో చర్చించి ఈ పథకాలను దశలవారీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్యాలెస్ మైదానంలో బెంగళూరు ఉత్తర నియోజక వర్గం కార్యకర్తలు శనివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో సన్మానాన్ని స్వకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి అవసరమైన సర్క్యూట్ రైలు సహా వివిధ పథకాలను చేపట్టడానికి చర్యలు చేపడతానని భరోసా ఇచ్చారు.
	
	ఐదేళ్లలో తాము సాధించబోయే ప్రగతిని నివేదిక రూపంలో ప్రజలకు అందజేస్తామని చెప్పారు. రైల్వే మంత్రిగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శనంలో ముందుకు సాగుతానని తెలిపారు. పార్టీ కార్యకర్తలు తనపై ఉంచిన ప్రేమానురాగాలను కాపాడుకుంటానని, చెడ్డ పేరు రాకుండా మసలుకుంటానని తెలిపారు. తనను అభినందించడానికి పూలహారాలు, తల పాగాలు తీసుకు రావద్దని కార్యకర్తలను కోరారు. కటౌట్లు, బ్యానర్లను ఏర్పాటు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. విధాన సౌధ సమీపంలోని విశ్వేశ్వరయ్య టవర్స్‌లో తన కార్యాలయం ఉందని, కార్యకర్తలు అక్కడికి వచ్చి తన ద్వారా జరిగే పనులను చేయించుకోవచ్చని ఆయన సూచించారు.
	 
	సర్కారు పతనం తథ్యం
	 
	రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఏ క్షణంలోనైనా పతనం కావచ్చని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ జోస్యం చెప్పారు. అభినందన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పరిస్థితి బాగా లేదని, కనుక కార్యకర్తలు మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, హోం శాఖ మంత్రి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పోలీసు శాఖలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. పోలీసు అధికారుల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
