గోడ దూక లేదు .. దర్జాగానే వెళ్లాడు! | Bangalore: jail politics help rapist 'psycho Shankar' escape | Sakshi
Sakshi News home page

గోడ దూక లేదు .. దర్జాగానే వెళ్లాడు!

Sep 5 2013 6:44 AM | Updated on Aug 21 2018 7:26 PM

సైకో కిల్లర్, వరుస లైంగిక దాడులకు పాల్పడిన జయశంకర్ (సైకో శంకర్) పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం నుంచి తప్పించుకోవడానికి జైలు అధికారులు, సిబ్బందే కారణమని వెలుగు చూసింది.

 బెంగళూరు, న్యూస్‌లైన్ : సైకో కిల్లర్, వరుస లైంగిక దాడులకు పాల్పడిన జయశంకర్ (సైకో శంకర్) పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం నుంచి తప్పించుకోవడానికి జైలు అధికారులు, సిబ్బందే కారణమని వెలుగు చూసింది. అతను 30 అడుగుల గోడ దూకి పారిపోలేదని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దర్జాగా జైలు ప్రధాన ద్వారం నుంచే బయటకు వెళ్లాడని తెలుసుకున్న పోలీసు అధికారులు ఇప్పుడు మరో రెండు ప్రత్యేక బృందాలతో (మొత్తం ఐదు బృందాలు) దర్యాప్తును ముమ్మరం చేశారు.

సైకో శంకర్ ఆదివారం వేకువ జామున నాలుగు గంటల సమయంలో నకిలీ తాళం ఉపయోగించి బయటకు వచ్చాడని, పోలీసు దుస్తులు ధరించి 30 అడుగుల గోడదూకి పారిపోయాడనే కథనాలు వినిపించాయి. అతనికి గాయాలయ్యాయని, ఆ సమయంలో భారీ వర్షం వచ్చిందని, కరెంటు కూడా పోయిందని తొలుత జైలు సిబ్బంది చెప్పిన మాటలను అందరూ విశ్వసించారు. శంకర్ శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో జైలు మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్లాడని తోటి ఖైదీలు దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఉప్పందించారని సమాచారం.

 జరిగిందేమంటే...

 పరప్పన అగ్రహార జైలులో అనేక మంది ఖైదీలు వివిధ కేసులలో శిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఉన్నారు. చాలా మంది మద్యం సేవించడానికి అలవాటు పడ్డారు. వీరికి నిత్యం జైలులో మద్యం సరఫరా చేయడానికి కొందరు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. తద్వారా లభించే లాభాన్ని అందరూ పంచుకుంటున్నారు. లాభంలో అధికారులు, సిబ్బందికి 90 శాతం, మద్యం తెచ్చి ఇచ్చిన వారికి 10 శాతం వెళుతుంది. మద్యం తెచ్చేది ఎవరో కాదు, ఖైదీలే. రోజూ రాత్రి 8 గంటలకు కొందరు బయటకు వెళ్లి మద్యం తీసుకుని తిరిగి వస్తుంటారు.

మూడు నెలలుగా శంకర్ అధికారులు, సిబ్బంది వద్ద మంచి పేరు తెచ్చుకున్నాడు. తాను మారిపోయానని, చేసిన తప్పులకు క్షోభ పడుతున్నానని వారి వద్ద నమ్మబలుకుతూ వచ్చే వాడు. నిజమేనని జైలు సిబ్బందీ భ్రమపడ్డారు. శనివారం రాత్రి సహచర ఖైదీలతో పాటు పోలీసు దుస్తులు ధరించి మద్యం తీసుకు రావడానికి వెళ్లాడు. మిగిలిన వారు తిరిగి వచ్చారు కానీ, శంకర్ ఆచూకీ లేదు. అర్ధరాత్రి దాటినా అతని జాడ లేకపోవడంతో సిబ్బంది హడలిపోయారు. ఎంతగానో గాలించినా ఫలితం లేకపోవడంతో,  30 అడుగుల గోడ దూకి తప్పించుకున్నాడని కట్టు కథలు అల్లారు.
 
 కరెంట్ కట్ చేయలేదు......కేపీటీసీల్


 శనివారం  నుంచి ఆదివారం పూర్తిగా పరప్పన అగ్రహార జైలుకు విద్యుత్ సరఫరా జరిగిందని కేపీటీసీఎల్ అధికారులు అంటున్నారు. అధికారులు, సిబ్బంది ప్రతి నిత్యం రాసే డైరీలో ఈ వివరాలున్నాయి.  ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జైలుకు నిరంతరం విద్యుత్ సరఫరా జరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement