breaking news
sycho Shankar
-
గోడ దూక లేదు .. దర్జాగానే వెళ్లాడు!
బెంగళూరు, న్యూస్‌లైన్ : సైకో కిల్లర్, వరుస లైంగిక దాడులకు పాల్పడిన జయశంకర్ (సైకో శంకర్) పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం నుంచి తప్పించుకోవడానికి జైలు అధికారులు, సిబ్బందే కారణమని వెలుగు చూసింది. అతను 30 అడుగుల గోడ దూకి పారిపోలేదని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దర్జాగా జైలు ప్రధాన ద్వారం నుంచే బయటకు వెళ్లాడని తెలుసుకున్న పోలీసు అధికారులు ఇప్పుడు మరో రెండు ప్రత్యేక బృందాలతో (మొత్తం ఐదు బృందాలు) దర్యాప్తును ముమ్మరం చేశారు. సైకో శంకర్ ఆదివారం వేకువ జామున నాలుగు గంటల సమయంలో నకిలీ తాళం ఉపయోగించి బయటకు వచ్చాడని, పోలీసు దుస్తులు ధరించి 30 అడుగుల గోడదూకి పారిపోయాడనే కథనాలు వినిపించాయి. అతనికి గాయాలయ్యాయని, ఆ సమయంలో భారీ వర్షం వచ్చిందని, కరెంటు కూడా పోయిందని తొలుత జైలు సిబ్బంది చెప్పిన మాటలను అందరూ విశ్వసించారు. శంకర్ శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో జైలు మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్లాడని తోటి ఖైదీలు దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఉప్పందించారని సమాచారం. జరిగిందేమంటే... పరప్పన అగ్రహార జైలులో అనేక మంది ఖైదీలు వివిధ కేసులలో శిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఉన్నారు. చాలా మంది మద్యం సేవించడానికి అలవాటు పడ్డారు. వీరికి నిత్యం జైలులో మద్యం సరఫరా చేయడానికి కొందరు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. తద్వారా లభించే లాభాన్ని అందరూ పంచుకుంటున్నారు. లాభంలో అధికారులు, సిబ్బందికి 90 శాతం, మద్యం తెచ్చి ఇచ్చిన వారికి 10 శాతం వెళుతుంది. మద్యం తెచ్చేది ఎవరో కాదు, ఖైదీలే. రోజూ రాత్రి 8 గంటలకు కొందరు బయటకు వెళ్లి మద్యం తీసుకుని తిరిగి వస్తుంటారు. మూడు నెలలుగా శంకర్ అధికారులు, సిబ్బంది వద్ద మంచి పేరు తెచ్చుకున్నాడు. తాను మారిపోయానని, చేసిన తప్పులకు క్షోభ పడుతున్నానని వారి వద్ద నమ్మబలుకుతూ వచ్చే వాడు. నిజమేనని జైలు సిబ్బందీ భ్రమపడ్డారు. శనివారం రాత్రి సహచర ఖైదీలతో పాటు పోలీసు దుస్తులు ధరించి మద్యం తీసుకు రావడానికి వెళ్లాడు. మిగిలిన వారు తిరిగి వచ్చారు కానీ, శంకర్ ఆచూకీ లేదు. అర్ధరాత్రి దాటినా అతని జాడ లేకపోవడంతో సిబ్బంది హడలిపోయారు. ఎంతగానో గాలించినా ఫలితం లేకపోవడంతో, 30 అడుగుల గోడ దూకి తప్పించుకున్నాడని కట్టు కథలు అల్లారు. కరెంట్ కట్ చేయలేదు......కేపీటీసీల్ శనివారం నుంచి ఆదివారం పూర్తిగా పరప్పన అగ్రహార జైలుకు విద్యుత్ సరఫరా జరిగిందని కేపీటీసీఎల్ అధికారులు అంటున్నారు. అధికారులు, సిబ్బంది ప్రతి నిత్యం రాసే డైరీలో ఈ వివరాలున్నాయి. ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జైలుకు నిరంతరం విద్యుత్ సరఫరా జరిగింది. -
సైకో శంకర్‌ను పట్టిస్తే రూ. 5 లక్షల రివార్డు
బెంగళూరు, న్యూస్‌లైన్ : పరప్పన అగ్రహార జైలు నుంచి తప్పించుకున్న సైకో కిల్లర్, సీరియల్ రేపిస్ట్ జయ శంకర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర హోం మంత్రి కేజే జార్జ్ జైలును సందర్శించారు. జైలులోని ఆస్పత్రి ఆవరణలో ఉన్న ప్రత్యేక సెల్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన జైలు బయట మీడియాతో మాట్లాడారు. సైకో కిల్లర్ జయశంకర్ ఆచూకీ చెప్పిన వారికి రూ. ఐదు లక్షల నగదు అందజేస్తామని అన్నారు. జైలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే జయ శంకర్ తప్పించుకున్నాడని, ఇందుకు బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతకు వ ుుందు మాజీ హోం మంత్రి అశోక్ వ్యాఖ్యలపై ఆయన మండి పడ్డారు. తాను మంత్రి పదవి చేపట్టిన సమయంలో ఆయన రాజకీయాల్లోకే రాలేదని అన్నారు. తనకు ప్రజలు ఇచ్చే సర్టిఫికెట్ చాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి జార్జ్ వెంట డీజీపీ లాల్‌రుకుం పచావో, జైళ్ల శాఖ డీఐజీ గగన్ దీప్, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్క్ర్ తదితరులు ఉన్నారు. జైలులో గోడలు నేలమట్టం : పరప్పన అగ్రహారలోని ఆస్పత్రి పక్కన ఉన్న 15 అడుగుల ప్రహరీని సోమవారం నేలమట్టం చేశారు. జైలు ఆవరణంలో 15 అడుగుల ఎత్తు ఉన్న రెండు ప్రహరీల చివ రలో 30 అడుగుల ప్రహరీ ఉంది. హైవేలలో నిఘా : జయశంకర్ కోసం పోలీసులు హైవేలపై నిఘా పెట్టారు. శంకర్ ఎక్కువగా సెక్స్ వర్కర్ల కోసం డాబాలకు వచ్చే అలవాటుందని అన్నారు. ఇదిలా ఉంటే శంకర్‌కు మానసిక నిపుణులు వైద్యం అందిస్తున్నారు. అయితే ఇతను తప్పించుకున్న తీరు చూసి పోలీసులు, వైద్యులు ఆశ్చర్యపోయారు. డీఐజీ విశ్వనాథ్ నేతృత్వంలోని మూడు ప్రత్యేక బృందాలు సైకో శంకర కోసం గాలిస్తున్నాయి.