45 నిమిషాల్లోనే 33 రక్త పరీక్షలు | A Medical Device That Can Conduct 33 Diagnostic Tests in Just 45 Minutes | Sakshi
Sakshi News home page

45 నిమిషాల్లోనే 33 రక్త పరీక్షలు

Mar 28 2016 5:20 PM | Updated on Sep 3 2017 8:44 PM

45 నిమిషాల్లోనే 33 రక్త పరీక్షలు

45 నిమిషాల్లోనే 33 రక్త పరీక్షలు

రక్త పరీక్షల చేసుకుంటే అన్ని రిపోర్టుల కోసం కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు నిరీక్షించాల్సి వస్తుంది.

న్యూఢిల్లీ: రక్త పరీక్షల చేసుకుంటే అన్ని రిపోర్టుల కోసం  కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు నిరీక్షించాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బంది లేకుండా 33 రకాల డయోగ్నొస్టిక్స్‌కు కేవలం 45 నిమిషాల్లోనే గుర్తించి వాటికి సంబంధించిన నివేదికలను అందజేసే అద్భుతమైన వైద్య పరికరాన్ని అమెరికా రిటర్న్ 36 ఏళ్ల కనవ్ కహోల్ కనుగొన్నారు.
 

 రక్తపోటు, రక్తంలో సుగర్ లెవల్, హార్ట్ బీట్ రేట్, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం, మూత్రంలో ప్రొటీన్ తదితరాలే కాకుండా మలేరియా, డెంగ్యూ, హెపటైటిస్, హెచ్‌ఐవీ, టైఫాయిడ్ జబ్బులను కూడా ఈ డివైస్ కొన్ని నిమిషాల్లోనే గుర్తిస్తుంది. ఈ వైద్య పరికరానికి కనవ్ కహోల్ ‘స్వస్త్య స్లేట్’ అని పేరు పెట్టారు. అమెరికాలోని అరిజోన విశ్వవిద్యాలయంలో బయోమెడికల్ ఇన్‌ఫర్‌మేటిక్స్ విభాగంలో ఇంజనీరుగా పనిచేసిన కనవ్ తన రంగంలో మాతృదేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో భారత్‌కు తిరిగొచ్చారు.
 

 భారత్‌లో ప్రతి 1700 మందికి ఒక్క డాక్టర్ చొప్పున ఉన్నారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం కనీసం 1000 మందికి ఒక్కరు చొప్పున డాక్టర్లు ఉండాలని, ఈ నేపథ్యంలో భారత ప్రజలకు ఆరోగ్య సేవలు సకాలంలో అందాలంటే సాంకేతిక పరికరాల అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని తాను గుర్తించానని కనవ్ మీడియాకు తెలిపారు. అందుకనే తాను ఈ స్వస్త్య స్లేట్‌ను కనుగొనాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
 

 తాను కనిపెట్టిన ఈ పరికరం ప్రాథమికంగా మొబైల్ ఫ్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తుందని, సెల్‌ఫోన్ లేదా ట్యాబ్‌కు బీపీ మానిటర్, ఈసీజీ సిస్టమ్, బ్లడ్ షుగర్ మానిటర్, వాటర్ క్వాలిటీ యూనిట్‌ను అనుసంధామిస్తామని కనవ్ తెలిపారు. అన్ని పరీక్షల ఫలితాలను బ్లూటూత్ లేదా యూఎస్‌బీ కనెక్షన్ ద్వారా ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్‌కు పంపిస్తామని ఆయన తెలిపారు. వేగంగా రక్త పరీక్ష ఫలితాలను కనుగొనాల్సిన డెంగ్యూ, హెపటైటీస్ లాంటి జబ్బులకు ఇది ఎంతో ప్రయోజనకరమని ఆయన చెప్పారు. వైద్యుల అవసరం లేకుండానే 33 రకాల పరీక్షలను నిర్వహించేందుకు ఈ డివైస్ ఆక్సిలరీ నర్స్ మిడ్‌వైఫ్స్ (ఏఎన్‌ఎం), అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ ఆక్టివిస్ట్స్ (ఆశ)కు ఎంతో ఉపయోగకరమని ఆయన వివరించారు.
 

 రక్త పరీక్షల ఫలితాలను నేరుగా రోగులకే కాకుండా వారి సంబంధిత వైద్యులకు కూడా పంపించడం ఈ పరికరం ద్వారా సాధ్యమని కనవ్ తెలిపారు. అంతేకాకుండా రోగులకు ఏ డాక్టర్ వద్దకు వెళ్లాలో కూడా ఫలితాలనుబట్టి సూచించే వెసలుబాటు ఈ పరికరంలో ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ పరికరాన్ని నైజీరియా, పెరు, నార్వే, కెనడా, గుజరాత్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, బీహార్, మేఘాలయ తదితర 80 లోకేషన్లలో వినియోగిస్తున్నారని ఆయన తెలిపారు. దీని ధర కేవలం 53 వేల రూపాయలు మాత్రమేనని, అదే 33 పరీక్షలను నిర్వహించేందుకు విడివిడిగా పరికరాలను కొనుగోలు చేసినట్లయితే ఐదారు లక్ష ల రూపాయలు ఖర్చవుతుందని ఆయన చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement