అచ్చెన్నా.. ఆర్టీసీ ఓ టెక్కలి టెండర్‌!!

Minister acchennaidu followers eye on land belongs to the RTC - Sakshi

     టెక్కలిలో ఖరీదైన ఆర్టీసీ స్థలంపై మంత్రి అచ్చెన్న అనుచరుల కన్ను 

     రూ. 10 కోట్ల విలువైన స్థలానికి గోప్యంగా టెండర్లు 

     దీర్ఘకాలిక లీజు కింద కట్టబెట్టే యత్నాలు

     ఇతరులకు దక్కకుండా పావులు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కొండంత అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీ పరిస్థితి అసలే దినదినగండంగా ఉంది. అలాంటప్పుడు ఒడ్డున పడేసే ఏ చిన్న అవకాశం వచ్చినా సంస్థకు మేలు చేసి కాపాడాలి. అదే జీవనాధారంగా గడుపుతున్న వేల కుటుంబాలను నిలబెట్టాలి. కానీ వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్నా ఇబ్బంది లేదన్నట్లుగా రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి అనుచరులు ఆర్టీసీకి చెందిన ఖరీదైన స్థలం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.   

గుట్టుగా టెండర్లు.. 
మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దాదాపు మూడు ఎకరాల్లో ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఉంది. ఇందులో రెండు ఎకరాలు వాణిజ్య కార్యకలాపాల కోసం లీజుకిచ్చేందుకు ఇటీవల ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. అయితే ఈ టెండర్ల ప్రక్రియ గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయింది. టెండర్లు దాఖలు చేసినవారిలో మంత్రి అచ్చెన్నకు సన్నిహితుడైన లాడె శ్రీనివాస్‌ తదితర స్థానిక వ్యాపారులున్నారు. తెరపైకి వారి పేర్లు వచ్చినా ఆ స్థలం మంత్రి కోసమేనన్న విమర్శలున్నాయి. ఇతరులకు స్థలం దక్కకుండా రాజధాని స్థాయిలో పావులు కదుపుతున్నట్లు సమాచారం. 

రూ.10 కోట్ల విలువైన స్థలం... 
నియోజకవర్గ కేంద్రమైన టెక్కలిలో ప్రస్తుతం సెంటు స్థలం విలువ రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల దాకా ఉంది. ఈ ప్రకారం చూస్తే ఆర్టీసీ స్థలం విలువ కనిష్టంగా రూ.10 కోట్ల వరకూ ఉంటుంది. ప్రధాన రహదారికి ఆనుకొని ఆర్టీసీ స్థలం ఉండటంతో దీనికి మరింత డిమాండ్‌ ఉంది. ఇక్కడ ఫంక్షన్‌ హాల్, మల్టీఫ్లెక్స్‌ సినిమా థియేటర్, షాపింగ్‌ మాల్‌ నిర్మిస్తే అవి అక్షయపాత్రలా మారతాయనడంలో సందేహం లేదు. ఈ విషయం గ్రహించే మంత్రి అనుచరులు పక్కా ప్లాన్‌ ప్రకారం ఆర్టీసీ స్థలం దక్కించుకునేందుకు ప్రణాళిక రచించినట్లు తెలిసింది. టెండర్‌ నిబంధనల ప్రకారం 44 సంవత్సరాల లీజు కోసం రూ.5 కోట్లు అడ్వాన్సుగా చెల్లించాల్సి ఉంది. అలాగే ఏటా ఆర్టీసీకి లీజు కింద కొంత మొత్తం కూడా లీజుదారులు చెల్లించాలి. అయితే టెండర్లు ఖరారయ్యేవరకూ లీజు మొత్తం ఎంతనేది తెలిసే అవకాశం లేదని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.  

బహిరంగ టెండర్లు పిలిస్తే ఆర్టీసీకి మేలు 
విజయనగరం ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయంలో వాణిజ్య విభాగం అధికారుల వద్ద ఈ లీజు గురించి ప్రస్తావించగా  టెండర్లు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. అయితే అచ్చెన్నాయుడే రవాణా శాఖ మంత్రిగా ఉన్నందున ఆయన అనుచరులు నామమాత్ర లీజుతో విలువైన ఆర్టీసీ స్థలాన్ని దక్కించునే అవకాశం ఉంది. అసలు ప్రధాన పత్రికల్లో ఎక్కడా టెండరు ప్రకటన కనిపించకుండా ఏదో నామమాత్రంగా ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విలువైన స్థలానికి బహిరంగ టెండర్లు ఆహ్వానిస్తే ఆర్టీసీకి మేలు జరుగుతుందని టెక్కలి ప్రజలు స్పష్టం చేస్తున్నారు. 

Read latest Srikakulam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top