
ఎంఎస్ ధోని, చహల్
ముంబై : టీమిండియా యువ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ జట్టులో కీలక ఆటగాడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ వన్డే సిరీస్ నెగ్గడంలో చహల్ కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా భారత్‌లో జరిగిన వన్డే సిరీస్‌ల్లో అద్భుతంగా రాణించి గొప్ప స్పిన్నర్‌గా గుర్తింపు పొందాడు. అనతి కాలంలోనే చహల్ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. క్రీడాకారులతో గౌరవ్ కపూర్ నిర్వహించే బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోకు హాజరైన చహల్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. భారత జట్టుకు ఎంపికైన రోజుల్లో ధోని చేతుల మీదుగా క్యాప్ అందుకున్న ఘటనను ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నాడు.
‘నేను వన్డే క్యాప్‌ను మహీ భాయ్ నుంచే తీసుకున్నాను. అతనో దిగ్గజం.. అప్పుడే అతన్ని తొలిసారి దగ్గరగా చూసాను. అతని ముందు మాట్లాడలేకపోయేవాడిని. కానీ ధోని చాలా అద్భుతంగా మాట్లాడుతాడు. జింబాబ్వే పర్యటన సందర్భంగా ధోనిని తొలిసారి కలిసాను. అప్పుడు మహీసార్ అని పిలిచేవాడిని. రెండు ఓవర్లు అనంతరం అతను వచ్చి మహీ, ధోని, మహేంద్ర సింగ్ ధోని, భాయ్ వీటిలో నీకేది నచ్చితే అలా పిలువని చెప్పాడు.’ అని నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ధోనిపై చహల్ ప్రశంసలు కురిపించాడు. ఇలా చహల్ ధోని కొనియాడటం ఇదే తొలిసారేం కాదు. గతంలో సైతం తాను విజయవంతంగా రాణించడానికి ధోనినే కారణమని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. 2016 జింబాబ్వే పర్యటనలోనే చహల్‌తోపాటు కేఎల్ రాహుల్, మన్‌దీప్ సింగ్, రిషీ ధావన్, ఉనద్కత్‌లు అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశారు.