‘క్రికెట్‌ దేవుడిని మరోసారి గెలిపించండి’

Yuvraj Asking Vote For Sachin For Laureus Sporting Moment of 2000 To 2020 - Sakshi

సచిన్‌ టెండూల్కర్‌... భారత్‌లో క్రికెట్‌ బతికున్నంతవరకు ఈ పేరును ఎవరు మరిచిపోరు. క్రికెట్‌ ఒక మతంగా భావించే మన దేశంలో సచిన్‌ను దేవుడితో పోల్చడం సహజం. మాస్టర్‌ బ్లాస్టర్‌ తన క్రికెట్‌ చరిత్రలో లెక్కలేనన్ని రికార్డులను కొల్లగొట్టాడు. కాగా ప్రఖ్యాత లారెస్‌ స్పోర్టింగ్‌ మూమెంట్‌ 2000-2020కు సంబంధించి సచిన్‌ టెండుల్కర్‌ షార్ట్‌ లిస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే సచిన్‌కు ఓటు వేసి గెలిపించాలని కోహ్లి, పలువరు ఆటగాళ్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా భారత మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ క్రికెట్‌ దేవుడికి ఓటు వేసి గెలిపించాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

2011 వరకు మాస్టర్‌ తన 19 ఏళ్ల కెరీర్‌లో ఎన్ని రికార్డులు సాధించినా దేశానికి మరోసారి ప్రపంచకప్‌ సాధించిపెట్టలేదనే చిన్న వెలితి మాత్రం అలాగే ఉండిపోయింది. అయితే 2011లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌ మాస్టర్‌కు చివరి ప్రపంచకప్‌ అని బాగా ప్రచారం జరిగింది. ఆరోసారి ప్రపంచకప్‌ ఆడనున్న సచిన్‌ ఎలాగైనా దేశానికి కప్పును తీసుకురావాలని భావించాడు. అప్పటికే జట్టు కూడా ధోని నాయకత్వంలో వరుస విజయాలకు తోడు ప్రపంచకప్‌ స్వదేశంలో జరగనుడడంతో అన్నీ అనుకూలంగా మారాయి. దీంతో టోర్నీ మొదలయ్యాక టీమిండియా అప్రతిహాత విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో భారత్‌ శ్రీలంకపై ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ స్వదేశంలో సగర్వంగా రెండోసారి ప్రపంచకప్‌ను అందుకుంది. దీంతో మాస్టర్‌ అప్పటి తన 19 ఏళ్ల నిరీక్షణ ఫలించడంతో భావోద్వేగానికి గురవుతూ మైదానంలోకి చిన్న పిల్లాడిలా పరిగెత్తుకుంటూ వచ్చిన సన్నివేశం క్రికెట్‌ ప్రేమికులు ఎప్పటికి మరిచిపోరు. అందులోనూ తన హోంగ్రౌండ్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం సాధించి భారత్‌ కప్‌ సాధించడంతో సచిన్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మ్యాచ్‌ అనంతరం టీమిండియా ఆటగాళ్లు యువరాజ్‌, హర్బజన్‌, శిఖర్‌ ధవన్‌ తమ భుజాలపై సచిన్‌ను ఎత్తుకొని గ్రౌండంతా కలియతిరిగడం, తమ అభిమాన ఆటగాడిని తమ భుజాలపై మోసుకెళ్లడం మాకు గొప్ప విషయమని  ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ పేర్కొన్నాడు.  ఇక ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచిన సచిన్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'నేను బతికి ఉన్నది ఈ క్షణం కోసమే. క్రికెట్‌ అనే ఆటను ఏంచుకోవడానికి కారణం కూడా ఇదే' అంటూ సచిన్‌ భావోద్వేగానికి గురయ్యాడు.  

2011కు ముందు ఐదు(1992,96,99,2003,2007)ప్రపంచకప్‌లు ఆడిన సచిన్‌ వ్యక్తిగతంగా అన్నింట్లో స్థిరమైన ప్రదర్శననే కనబరిచాడు.దక్షిణాఫ్రికాలో జరిగిన 2003 ప్రపంచకప్‌లో సచిన్‌ మొత్తం 674 పరుగులు చేసి  ఒంటిచేత్తో జట్టును  ఫైనల్‌ వరకు తీసుకెళ్లాడు. అప్పటివరకు సచిన్‌ బ్యాటింగ్‌ తీరు చూసి కచ్చితంగా ఈసారి టీమిండియా కప్పు కొట్టబోతుందని చాలామంది ధీమా వ్యక్తం చేశారు. అయితే అనూహ్యంగా సచిన్‌ ఫైనల్లో తక్కువ స్కోరుకే అవుట్‌ కావడం, ఆసీస్‌ గెలవడం చకచకా జరిగిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మాస్టర్‌కు ఓటు వేసి గెలిపించాలనుకుంటే కింద ఉన్న లింక్‌ను క్లిక్‌ చేయండి
https://www.laureus.com/sporting-moments/2020/carried-on-the-shoulders-of-a-nation

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top