విండీస్‌.. విజయంతోనే ఇంటికి

World Cup 2019 West Indies Beat Afghanistan By 23 Runs - Sakshi

లీడ్స్‌ : ఇంగ్లండ్‌ వేదికగా జరగుతున్న ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ ప్రస్థానం విజయంతోనే ముగిసింది. గురువారం హెడింగ్లీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో విండీస్‌ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. కరేబియన్‌ జట్టు నిర్దేశించిన 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ నిర్ణీత ఓవర్లలో 288 పరుగులకు కుప్పకూలింది. అఫ్గాన్‌ ఆటగాళ్లలో ఇక్రామ్‌ అలీ(86; 93 బంతుల్లో, 8ఫోర్లు), రెహ్మత్‌ షా(62; 78 బంతుల్లో 10ఫోర్లు)అర్దసెంచరీలతో రాణించారు. అస్గర్‌ అఫ్గాన్‌(40), నజీబుల్లా(31) ఫర్వాలేదనిపించారు. విండీస్‌ బౌలర్లలో బ్రాత్‌వైట్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కీమర్‌ రోచ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్‌ భారీ స్కోర్‌ సాధించడంలో సహకరించిన షాయ్‌ హోప్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 
ఛేదనలో అఫ్గాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్‌, సారథి గుల్బాదిన్‌ నైబ్‌(5) తీవ్రంగా నిరాశ పరిచాడు. అనంతరం మరో ఓపెనర్‌ రెహ్మత్‌ షా ఇక్రామ్‌ అలీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ అర్దసెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం రెహ్మాత్‌ను బ్రాత్‌వైట్‌ ఔట్‌ చేసి విండీస్‌కు బ్రేక్‌ ఇస్తాడు. అనంతర వచ్చిన బ్యాట్స్‌మెన్‌ మెరుపు వేగంతో ఆడకపోవడంతో పాటు.. క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. భారీ స్కోర్‌ కావడం.. చివర్లో విండీస్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో అఫ్గాన్‌ ఓటమి చవిచూసింది. 

అంతకుముందు బ్యాట్స్‌మెన్‌ షాయ్‌ హోప్‌(77; 92బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), లూయిస్‌ (58; 78బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), పూరన్‌(58; 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలకు తోడు హెట్‌మైర్‌(39: 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హోల్డర్‌(45; 34 బంతుల్లో ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగుల భారీ స్కోరు చేసింది.  అఫ్గాన్‌ బౌలర్లలో దవ్లత్‌ రెండు వికెట్లు పడగొట్టగా, షిర్జాద్, నబి, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.
 ప్చ్‌.. గేల్‌..
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌కు శుభారంభం దక్కలేదు. కెరీర్‌లో చివరి వరల్డ్‌కప్‌ ఆడుతున్న కరేబియన్‌ వీరుడు క్రిస్‌ గేల్‌ (7) నిరాశపర్చాడు. దవ్లత్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ ఇక్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత నుంచి లూయిస్‌–హోప్‌ జోడీ రెండో వికెట్‌కు 88 పరుగులు జతచేసింది. లూయిస్‌ను ఔట్‌ చేయడం ద్వారా ఈ జోడీని రషీద్‌ ఖాన్‌ విడదీశాడు. ఆ తర్వాత హెట్‌మైర్‌తో కలసి హోప్‌ మరో ఉపయుక్త భాగస్వామ్యం(65) నెలకొల్పాడు. వీరిద్దరూ స్వల్పవ్యవధిలో ఔట్‌ కావడంతో విండీస్‌ స్కోరు కాసేపు మందగించింది. అయితే, ఆఖర్లో పూరన్‌–హోల్డర్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ జోడీ శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చివర్లో బ్రాత్‌వైట్‌ (14 నాటౌట్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో విండీస్‌ స్కోరు 300 దాటింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top