‘పంత్‌ను అందుకే అలా పిలుస్తా’

World Cup 2019 Sachin Says Pant Has Always Been Aggressive - Sakshi

బర్మింగ్‌హామ్‌: టీమిండియా యువ సంచలనం రిషభ్‌ పంత్‌పై క్రికెట్‌ గాడ్‌, మాస్టర్‌ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ ఆట తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ తొలి అరంగేట్రపు మ్యాచ్‌లో, అది కూడా అంత ఒత్తిడిలో తనదైన బ్యాటింగ్‌ శైలితో అదరగొట్టాడని ప్రశంసించాడు. అతడు తక్కువ పరుగులే సాధించినప్పటికీ ఉన్నంతసేపు ఆకట్టుకున్నాడన్నాడు. ఈ యువ ఆటగాడికి మరిన్ని అవకాశాలు ఇస్తే మరింత రాటుదేలుతాడని అభిప్రాయపడ్డాడు. అయితే ప్రపంచకప్‌ మిగతా మ్యాచ్‌ల్లో పంత్‌ ఆడేది లేనిది టీమ్‌ మేనేజ్‌మెంట్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేశాడు. 

‘ప్రపంచకప్‌ అరంగేట్రపు మ్యాచ్‌లో పంత్‌ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. తన బ్యాటింగ్‌తో అందరి నోళ్లు మూయించాడు. అతడి షాట్ల ఎంపికపై ఎలాంటి సందేహాలు లేవు. హార్దిక్‌ పాండ్యా​, రిషభ్‌ పంత్‌ విధ్వంసకర ఆటగాళ్లు. ప్రత్యర్థి జట్ల నుంచి మ్యాచ్‌ను అమాంతం లాగేసుకునే సత్తా వారికి ఉంది. పంత్‌ చాలా దూకుడైన ఆటగాడు. నేను అతడిని డైనమెట్‌ అని పిలుస్తుంటాను. ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో అతడి ఆట చూశాకా అలా పిలవడం సరైనదే అని అనిపించింది. పంత్‌ను తదుపరి మ్యాచ్‌ల్లో కొనసాగించేది లేనిది టీమ్‌ మేనేజ్‌మెంట్‌దే తుది నిర్ణయం. ఇక మ్యాచ్‌ గురించి మాట్లాడితే కోహ్లి, రోహిత్‌లు బ్యాటింగ్‌ చేస్తున్నంతసేపు మ్యాచ్‌ మనచేతుల్లోనే ఉంది. కానీ వీరిద్దరూ ఔటైన అనంతరం మ్యాచ్‌ చేజారిపోయింది’అంటూ సచిన్‌ వ్యాఖ్యానించాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top