ఇంగ్లండ్‌కు పయనమైన పంత్‌ | World Cup 2019 Pant Standby for Injured Dhawan | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌కు పయనమైన పంత్‌

Jun 12 2019 7:42 PM | Updated on Jun 12 2019 8:05 PM

World Cup 2019 Pant Standby for Injured Dhawan  - Sakshi

ఇంగ్లండ్‌కు వెళ్లాలని పంత్‌కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది..

నాటింగ్‌హామ్‌: ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన శిఖర్‌ ధావన్‌కు స్టాండ్‌ బై ప్లేయర్‌గా రిషభ్‌ పంత్‌ ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. బుధవారం టీమిండియాతో పంత్‌ కలుస్తాడని తెలిపింది. ధావన్‌ గాయం విషయంలో బీసీసీఐ ఆచితూచి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ధావన్‌ గాయం నుంచి కోలుకోవడానికి 10 నుంచి 12 రోజులు పట్టే అవకాశం ఉందని, ఆతర్వాతే అతడి పరిస్థితి సమీక్షిస్తామని తెలిపాడు. అప్పటివరకు పంత్‌ ధావన్‌కు బ్యాకప్‌ ఉంటాడని పేర్కొన్నాడు. 

ఇక ధావన్‌ దూరం కావడంతో రోహిత్‌కు జోడిగా రాహుల్‌ బరిలోకి దిగుతాడని తెలిపాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో విజయ్‌ శంకర్‌నే బెస్ట్‌ ఆప్షన్‌గా పరిగణిస్తున్నామని పేర్కొన్నాడు. ఇక పంత్‌ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కే అందుబాటులో ఉంటాడని, టీమిండియా సభ్యులతో ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంటాడని వివరించాడు. అయితే ధావన్ ప్లేస్‌లో రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. జట్టు అవసరాల మేరకు తుది జట్టులోకి పంత్‌ను తీసుకోవడంపై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఐసీసీ నిబంధనలతోనే ఈ చిక్కు..
ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రపంచకప్‌లో గాయపడిన ఆటగాడి స్థానంలో మరొకరిని తీసుకంటే.. తర్వాత మళ్లీ ఆ ఆటగాడిని జట్టులోకి తీసుకునే అవకాశం లేదు. దీంతో ధావన్‌ స్థానంలో పంత్‌ను తీసుకుంటే.. గాయం నుంచి ధావన్‌ త్వరగా కోలుకుంటే మళ్లీ జట్టులోకి తీసుకోవడానికి వీలులేదు. ఐసీసీ టోర్నీలు అంటేనే రెచ్చిపోయే ధావన్‌ను పూర్తిగా పక్కకు పెట్టడం బీసీసీఐకు నచ్చటం లేదు. దీంతో ధావన్‌ను తప్పించి పంత్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది.  ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌ కూర్పు సెట్‌ అయిందనుకున్న తరుణంలో ధావన్‌ గాయం మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement