అఫ్గాన్‌ను చిత్తుచిత్తుగా..

World Cup 2019 England Beat Afghanistan By 150 Runs - Sakshi

150 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం

నాలుగు విజయాలతో ఆగ్రస్థానంలో ఇంగ్లండ్‌

వరుసగా ఐదో ఓటమి చవిచూసిన అఫ్గాన్‌

ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ఇయాన్‌ మోర్గాన్‌

మాంచెస్టర్‌ : ఆతిథ్య ఇంగ్లండ్‌ దెబ్బకి పసికూన అఫ్గానిస్తాన్‌ బెంబేలెత్తింది. ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గాన్‌తో జరిగిన పోరులో 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ జయభేరి మోగించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలమైన ఇంగ్లండ్‌ జట్టు అఫ్గాన్‌ను చెడుగుడు ఆడుకుంది. తొలుత బ్యాటింగ్‌లో విశ్వరూపం చూపించి అనంతరం కట్టుదిట్టమైన బౌలింగ్‌తో విజయం సాధించింది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులకే పరిమితమైంది. అఫ్గాన్‌ ఆటగాళ్లలో హష్మతుల్లా(74), రహ్మత్‌(46), అఫ్గాన్‌(44) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆర్చర్‌, రషీద్‌ తలో మూడు వికెట్లతో రాణించగా.. మార్క్‌ వుడ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అఫ్గాన్‌ బౌలర్లను ఊచకోత కోసిన ఇంగ్లండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

అంతకుముందు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సిక్సర్ల విధ్వంసం సృష్టించాడు. అఫ్గానిస్తాన్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ 71 బంతుల్లోనే 17 సిక్సర్లు, 4 ఫోర్లతో 148 పరుగులు చేశాడు. అతనికి తోడు బెయిర్‌ స్టో (90: 99 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రూట్‌ (88: 82 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌), మొయిన్‌ అలీ(31: 9 బంతుల్లో ఫోర్, 4సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో ఇంగ్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. అఫ్గాన్‌ బౌలర్లలో దవ్లత్‌ జద్రాన్‌(3/85), గుల్బదిన్‌ నైబ్‌(3/68) చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

బాదుడే బాదుడు...
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ తీసుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు విన్స్‌(26), బెయిర్‌ స్టో తొలి వికెట్‌కు 44 పరుగులు మాత్రమే జోడించారు. అయితే, ఆ తర్వాత ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ వచ్చిన వాళ్లు వచ్చినట్లు బ్యాట్‌ ఝళిపించారు. తొలుత బెయిర్‌ స్టో, రూట్‌ జోడీ ఆచితూచి ఆడినా నిలదొక్కుకున్నాక బ్యాట్‌కు పనిచెప్పారు. ఈ జోడీ రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించింది. ఈ క్రమంలో సెంచరీకి పది పరుగుల దూరంలో బెయిర్‌స్టో అవుటయ్యాడు. అయితే, ఈ జోడీని విడదీశామనే ఆనందం ఆఫ్గాన్‌ బౌలర్లకు కాసేపట్లోనే ఆవిరైంది. ఇంగ్లండ్‌ సారథి మోర్గాన్‌ క్రీజులోకి వచ్చీ రాగానే బాదుడు మొదలుపెట్టాడు. బౌలర్‌ ఎవరేనేది చూడకుండా బంతిని స్టాండ్స్‌లోకి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 

తొలుత 36 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న మోర్గాన్‌ ఆ తర్వాత మరో 21 బంతుల్లోనే సెంచరీకి చేరుకున్నాడు. శతకం అనంతరం మరింత చెలరేగిన మోర్గాన్‌ ఒక దశలో డబుల్‌ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే, 47వ ఓవర్లో ఆఫ్ఘన్‌ కెప్టెన్‌ నైబ్‌.. రూట్, మోర్గాన్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. ఆఖర్లో బెన్‌స్టోక్స్‌(2), బట్లర్‌(2)త్వరగానే వెనుదిరిగినా మొయిన్‌ అలీ సైతం బ్యాట్‌ ఝళిపించడంతో ఇంగ్లండ్‌ స్కోరు 400కు మూడు పరుగుల దూరంలో నిలిచింది. అఫ్గాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ 9 ఓవర్లలో ఏకంగా 110 పరుగులు ఇవ్వడం గమనార్హం. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top