గట్టెక్కిన జర్మనీ | World Cup 2014 : Klose scores record goal; Germany vs Ghana match ends in 2-2 draw | Sakshi
Sakshi News home page

గట్టెక్కిన జర్మనీ

Jun 23 2014 12:56 AM | Updated on Oct 22 2018 5:58 PM

గట్టెక్కిన జర్మనీ - Sakshi

గట్టెక్కిన జర్మనీ

పోర్చుగల్ జట్టుపై ఘనవిజయం సాధించి ఊపులో ఉన్న జర్మనీని తమ రెండో మ్యాచ్‌లో అనూహ్యంగా ఘనా జట్టు నిలువరించింది.

 ఘనాతో మ్యాచ్ 2-2తో డ్రా  
 అత్యధిక గోల్స్ రికార్డును సమం చేసిన క్లోజ్
 
 జర్మనీ: 2
 మారియా గోట్జే  51వ, మిరోస్లావ్ క్లోజ్ 71వ
 ఘనా: 2
 ఆండ్రూ అయే 54వ,
 అసమో గ్యాన్ 63వ
 
 సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన జర్మనీ వెటరన్ స్ట్రయికర్ మిరోస్లావ్ క్లోజ్ ప్రపంచకప్ చరిత్రలో సంచలనం సష్టించాడు. బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో అత్యధిక గోల్స్ (15) రికార్డు సమం చేయడమే కాకుండా జట్టును పరాజయం నుంచి తప్పించాడు. అటు ఆఫ్రికన్ జట్టు ఘనా అద్భుత రీతిలో చెలరేగి జోరు మీదున్న జర్మనీని నిలువరించగలిగింది.
 
 ఫోర్టలెజా: పోర్చుగల్ జట్టుపై ఘనవిజయం సాధించి ఊపులో ఉన్న జర్మనీని తమ రెండో మ్యాచ్‌లో అనూహ్యంగా ఘనా జట్టు నిలువరించింది. గ్రూప్ ‘జి’లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ థ్రిల్లర్ మ్యాచ్‌లో ఇరు జట్ల పోటాపోటీ ప్రదర్శన కారణంగా 2-2తో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
 
  అయితే వెటరన్ స్ట్రయికర్ మిరోస్లావ్ క్లోజ్‌కు ఈ మ్యాచ్ చిరస్మరణీయం అయ్యింది. ఇప్పటిదాకా ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ సాధించిన రికార్డు రొనాల్డో (బ్రెజిల్) పేరిట ఉండగా 36 ఏళ్ల క్లోజ్ దాన్ని సమం చేశాడు. రొనాల్డో కూడా ఘనాపైనే ఈ ఘనత సాధించగా... ఆ టోర్నీ జర్మనీలో జరిగింది. ఇప్పుడు క్లోజ్ బ్రెజిల్‌లో జరుగుతున్న టోర్నీలో ఘనాపైనే చేయడం కాకతాళీయం. అలాగే నాలుగు ప్రపంచకప్‌ల్లో గోల్స్ సాధించిన మూడో ఆటగాడి (గతంలో పీలే, ఉవ్ సీలర్)గానూ నిలిచాడు.
 
  మ్యాచ్‌లో మరో గోల్‌ను మారియా గోట్జే చేశాడు. ఘనా తరఫున ఆండ్రియా అయే, అసమో గ్యాన్ మెరుపులు మెరిపించారు. అటు ఆఫ్రికా నుంచి అత్యధిక గోల్స్ (5) సాధించిన ఆటగాడిగా రోజర్ మిల్లా (కామెరూన్) రికార్డును గ్యాన్ సమం చేశాడు. మొత్త నాలుగు గోల్స్ కూడా ద్వితీయార్థంలోనే నమోదయ్యాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా గోట్జే నిలిచాడు.
 
 మైదానంలో చురుగ్గా కదులుతూ మెరుపు వేగంతో పాస్‌లు ఇచ్చుకుంటూ ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడులు చేయడం జర్మన్లకు అలవాటు. అయితే వీరికి సమ ఉజ్జీయా అన్నట్టు ప్రథమార్ధమంతా ఆఫ్రికన్ సింహాలు కూడా ఇదే రీతిన చెలరేగాయి.
 
 వీరికి ఏడో నిమిషంలోనే ఫ్రీ కిక్ అవకాశం లభించినా విఫలమైంది. 32వ నిమిషంలోనూ మిడ్ ఫీల్డర్ ముంతారి కొద్ది దూరం నుంచి కొట్టిన షాట్‌ను జర్మనీ గోల్ కీపర్ న్యూయర్ వేగంగా స్పందించి అడ్డుకున్నాడు.
 
 అయితే 37వ నిమిషంలో గోట్జే హాఫ్ వాలీ నేరుగా ఘనా గోల్ కీపర్ దౌడా చేతుల్లోకి వెళ్లింది.  45వ నిమిషంలో ఆండ్రూ అయే హెడర్ గోల్ కూడా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
 
 ద్వితీయార్ధంలో పంథా మార్చిన జర్మనీకి 51వ నిమిషంలో ఫలితం లభించింది. కుడివైపు నుంచి ముల్లర్ అందించిన పాస్‌ను అందుకున్న మారియో గోట్జే ఇద్దరు డిఫెండర్లను తప్పిస్తూ ‘హెడర్’ షాట్‌తో గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
 
 కానీ ఈ సంతోషం జర్మనీకి ఎక్కువ సేపు నిలువలేదు. 54వ నిమిషంలోనే అఫ్ఫుల్ పాస్‌ను అందుకున్న అయే విల్లులా వెనక్కి వంగి హెడర్‌తో గోల్ చేసి స్కోరును సమం చేశాడు.
 
 ఇదే ఉత్సాహంతో కదిలిన ఘనా 63వ నిమిషంలో జర్మనీకి షాక్‌నిస్తూ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. మిడ్ ఫీల్డ్ నుంచి బంతిని అందుకున్న ముంతారి... గ్యాన్‌కు సూపర్ పాస్‌ను ఇవ్వగా ఎలాంటి పొరపాటుకు తావీయకుండా తను ‘రికార్డు’ గోల్ చేసి ఘనాను ఆనందంలో నింపాడు.
 
 ఇక ఘనా సంచలనం తప్పదా అనుకుంటున్న పరిస్థితిలో క్లోజ్ చెలరేగాడు. 69వ నిమిషంలో గోట్జే స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన తను మరో రెండు నిమిషాలకే సత్తా చూపాడు. 71వ నిమిషంలో టోనీ క్రూస్ ఇచ్చిన కార్నర్ కిక్‌ను హోవెడెస్ ద్వారా అందుకున్న క్లోజ్ గోల్ పోస్టుకు అతి సమీపం నుంచి గోల్ చేశాడు.
 
 ఆ తర్వాత కూడా ఇరు జట్ల నుంచి దాడులు జరిగినా గోల్ కీపర్లు సమర్థవంతంగా అడ్డుకోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
 
 నేటి టాప్ మ్యాచ్
 
 బ్రెజిల్ x కామెరూన్
 బ్రెసిలియా (బ్రెజిల్): సాకర్ ప్రపంచకప్‌లో బ్రెజిల్ జట్టు మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు జరగనున్న గ్రూప్ ‘ఎ’ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కామోరూన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. క్రొయేషియాపై విజయం... మెక్సికోతో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న బ్రెజిల్ 4 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మెక్సికో ఖాతాలో కూడా 4 పాయింట్లే ఉన్నా గోల్స్ సగటులో ఈ జట్టు వెనుకబడి రెండో స్థానంలో ఉంది.
 
 ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్రిక్వార్టర్స్‌కు చేరుకోవాలంటే కామోరూన్‌తో మ్యాచ్‌లో బ్రెజిల్ కచ్చితంగా గెలిచి తీరాలి. ఓడితే మాత్రం నాకౌట్ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఒకవేళ డ్రాతో నాకౌట్‌కు చేరుకున్నా... రెండో రౌండ్‌లో నెదర్లాండ్స్ లేదా చిలీతో తలపడాల్సి వస్తుంది. మరోవైపు ఆడిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ఓడిన కామోరూన్‌కు నాకౌట్ అవకాశాలు దూరమయ్యాయి.

కొరియాపై అల్జీరియా గెలుపు

సాకర్ ప్రపంచకప్‌లో అల్జీరియా తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం అర్ధరాత్రి దాటాకా జరిగిన గ్రూప్-హెచ్ లీగ్ మ్యాచ్‌లో 4-2 తేడాతో కొరియా రిపబ్లిక్‌పై గెలిచింది. అల్జీరియా తరఫున స్లిమాని (26వ ని.), రఫీక్ హెలిచీ (28వ ని.), జబోవ్ (38వ ని.), బ్రహిమి (62వ ని.) గోల్స్ చేశారు. హెచ్‌ఎం సన్ (50వ ని.), జేసీ కూ (72వ ని.) కొరియాకు గోల్స్ అందించారు. మ్యాచ్ ఆరంభం నుంచి మంచి సమన్వయంతో కదిలిన అల్జీరియా తొలి అర్ధభాగంలో 3-0 ఆధిక్యాన్ని సంపాదించింది.
 
 అయితే రెండో అర్ధభాగంలో పుంజుకున్న కొరియా ఆటగాళ్లు అల్జీరియా డిఫెన్స్‌పై పదేపదే దాడులు చేసి రెండు గోల్స్ సాధించారు. కానీ మ్యాచ్ చివరి వరకు ఇదే దూకుడును కనబర్చలేకపోయారు. అల్జీరియా రక్షణాత్మకంగా ఆడటంతో కొరియాకు గోల్స్ చేసే అవకాశం లభించలేదు.

 
 రొనాల్డో అభినందన
 ‘15 గోల్స్ క్లబ్‌లోకి క్లోజ్‌కు స్వాగతం. ప్రస్తుతం నీవెంత సంతోషంగా ఉన్నావో నేనూహించగలను. నిజంగా ఇది గొప్ప ప్రపంచకప్. ఇక రికార్డులున్నవి బద్దలయ్యేందుకే. ఈ విషయంలో నాకెలాంటి విచారంలేదు’    
 -రొనాల్డో ట్వీట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement