స్వారెజ్‌కు తిక్కుంది... దానికి లెక్కేలేదు | World Cup 2014 Bite Controversy : Luis Suarez's Tough Childhood to Blame, Says Sports Psychologist | Sakshi
Sakshi News home page

స్వారెజ్‌కు తిక్కుంది... దానికి లెక్కేలేదు

Jun 26 2014 1:17 AM | Updated on Oct 22 2018 5:58 PM

స్వారెజ్‌కు తిక్కుంది... దానికి లెక్కేలేదు - Sakshi

స్వారెజ్‌కు తిక్కుంది... దానికి లెక్కేలేదు

క్రికెట్ దేవుడయ్యాడంటే దానికి కారణం తన ప్రవర్తన. కానీ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లూయిస్ స్వారెజ్‌కు ఇది తెలియదేమో..!

ఎంత నైపుణ్యం ఉన్న ఆటగాడైనా హద్దుల్లో ఉండాలి. సచిన్ టెండూల్కర్
 క్రికెట్ దేవుడయ్యాడంటే దానికి కారణం తన ప్రవర్తన. కానీ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లూయిస్ స్వారెజ్‌కు ఇది తెలియదేమో..! బంతిని అద్భుతంగా నియంత్రిస్తూ... ఒంటిచేత్తో ఫలితాలను మార్చే స్వారెజ్... తన ప్రవర్తనతో మాత్రం బ్యాడ్‌బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. తన తిక్క చేష్టలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు చీదరించుకునే పరిస్థితిని కల్పించుకుంటున్నాడు.
 
 సాక్షి క్రీడావిభాగం
 అపార నైపుణ్యమున్న ఉరుగ్వే ఆటగాడు స్వారెజ్‌కు వివాదాలు కొత్తేంకాదు. ఏడుగురు మగపిల్లల సంతానంలో నాలుగోవాడిగా పుట్టిన స్వారెజ్ తన కుటుంబంతో ఏడేళ్ల వయసులో రాజధాని మాంటెవిడియోకు తరలివచ్చాడు. అతనికి తొమ్మిదేళ్లు వచ్చేసరికి తల్లిదండ్రులు విడిపోయారు. అప్పుడే ఫుట్‌బాల్‌లో ఓనమాలు నేర్చుకొని 14 ఏళ్ల ప్రాయంలో స్వదేశీ లీగ్ జట్టు నాసియోనల్‌లో చేరాడు. 16 ఏళ్ల వయసులో తనకు రెడ్‌కార్డు చూపెట్టిన రిఫరీని స్వారెజ్ తలతో ఢీకొట్టాడు.
 
 ఒకరోజు రాత్రి మద్యం సేవిస్తూ పట్టుబడ్డాడు. ఆటను సీరియస్‌గా తీసుకోకపోతే మరోసారి ఫుట్‌బాల్ జోలికి రావొద్దని కోచ్ హెచ్చరించడంతో అతను గాడిలో పడ్డాడు. 2006 సీజన్‌లో తన అద్భుత ఆటతీరుతో నాసియోనల్ జట్టుకు ఉరుగ్వే లీగ్ టైటిల్ అందించాడు. 2007లో జాతీయ యూత్ జట్టులో ఎంపికైన స్వారెజ్ అండర్-20 ప్రపంచకప్‌లో ఉరుగ్వే జట్టుకు నాలుగో స్థానం దక్కడంలో ముఖ్యపాత్ర పోషించాడు. 2007 నుంచి 2011 వరకు నెదర్లాండ్స్‌కు చెందిన విఖ్యాత క్లబ్ అజాక్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను 2011 నుంచి ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ లో లివర్‌పూల్ జట్టు తరఫున ఆడుతున్నాడు.
 
 విచారణకు ‘ఫిఫా’ ఆదేశం
 నటాల్ (బ్రెజిల్): క్షణికావేశంలో ఇటలీ డిఫెండర్ జియార్జియో చిలిని భుజాన్ని కొరికిన ఉరుగ్వే స్టార్ లూయిస్ స్వారెజ్ సంఘటనపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) విచారణకు ఆదేశించింది. స్వారెజ్‌తోపాటు ఉరుగ్వే ఫుట్‌బాల్ సంఘం అధికారులు తమ సాక్ష్యాలను ‘ఫిఫా’ క్రమశిక్షణ సంఘానికి భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 1.30లోపు సమర్పించాలని ‘ఫిఫా’ ఒక ప్రకటనలో తెలిపింది. విచారణ తర్వాత శనివారంలోపే స్వారెజ్‌పై నిర్ణయం తీసుకునే అవకాశముంది. అదే రోజు ఉరుగ్వే ప్రిక్వార్టర్ ఫైనల్లో కొలంబియాతో తలపడాల్సి ఉంది. ఒకవేళ స్వారెజ్ దోషిగా తేలితే అతనిపై రెండేళ్ల నిషేధం లేదా... కనిష్టంగా రెండు మ్యాచ్‌ల నుంచి గరిష్టంగా 24 మ్యాచ్‌ల వేటు పడే అవకాశముంది. ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 8 మ్యాచ్‌ల నిషేధం ఇటలీ ప్లేయర్ మౌరో తస్సోటిపై 1994లో పడింది.
 
 స్వారెజ్ వివాదాల చిట్టా
 2010 ప్రపంచకప్‌లో జూలై 2న ఘనాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ అదనపు సమయం చివరి క్షణాల్లో స్వారెజ్ గోల్‌పోస్ట్‌లోనికి వెళ్తున్న బంతిని ఉద్దేశపూర్వకంగా చేతితో నిలువరించాడు. దాంతో రిఫరీ అతనికి రెడ్‌కార్డు చూపెట్టి.. ఘనాకు పెనాల్టీ కిక్ ఇచ్చారు. అయితే పెనాల్టీ కిక్‌ను ఘనా ప్లేయర్ వృథా చేశాడు. ఆ తర్వాత ‘షూట్‌అవుట్’లో ఉరుగ్వే నెగ్గి సెమీఫైనల్ చేరింది.
 
 2010 నవంబరు 20న నెదర్లాండ్స్ లీగ్‌లో అజాక్స్ జట్టు తరఫున ఆడుతూ స్వారెజ్ తన ప్రత్యర్థి జట్టు పీఎస్‌వీ ఎందోవెన్స్ మిడ్‌ఫీల్డర్ ఓట్మన్ బక్కాల్‌ను కొరికాడు. దాంతో అతనిపై ఏడు మ్యాచ్‌ల నిషేధం పడింది.
 
 2011 అక్టోబరు 15న ఈపీఎల్‌లో మాంచెస్టర్ యునెటైడ్ ప్లేయర్ ప్యాట్రిక్ ఎవ్రా పై స్వారెజ్ జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడు. విచారణ అనంతరం స్వారెజ్‌పై ఎనిమిది మ్యాచ్‌ల నిషేధంతోపాటు 40 వేల పౌండ్ల జరిమానా పడింది. ఈ సంఘటన తర్వాత తదుపరి మ్యాచ్ ప్రారంభ సమయంలో ఫ్రాన్స్ నల్లజాతి ఆటగాడు ప్యాట్రిక్ ఎవ్రాతో కరచాలనం చేసేందుకు స్వారెజ్ నిరాకరించాడు.
 
 2013 ఏప్రిల్ 21న ఈపీఎల్ మ్యాచ్‌లో చెల్సీ డిఫెండర్ బ్రానిస్లావ్ ఇవనోవిచ్‌ను కొరకడంతో స్వారెజ్‌పై 10 మ్యాచ్‌ల నిషేధం విధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement