థంపికి అందుకే బౌలింగ్‌ ఇచ్చా: విలియమ్సన్‌

Williamson Explains Why He Gave 18th Over to Thampi - Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్‌ రెండు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అయితే విజయాని​కి దగ్గరగా వెళుతున్న సన్‌రైజర్స్‌కు బాసిల్‌ థంపి వేసిన ఓవర్‌ భారీ షాక్‌ ఇచ్చింది. ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్న థంపి సన్‌రైజర్స్‌కు విజయాన్ని దూరం చేశాడు. అయితే ఖలీల్‌ను కాదని థంపికి బంతినివ్వడంపై సారథి విలియమ్సన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన విలియమ్సన్‌ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.  రిషభ్‌ పంత్ ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ కావడంతో కుడిచేతివాటం పేసర్ సరైన ఆప్షన్ అని భావించడంతోనే థంపికి అవకాశం ఇచ్చానని తెలిపాడు. 

అయితే ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ రిషబ్ పంత్ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. అతడిని ఒత్తిడిలోకి నెట్టినప్పటికీ తమ ప్రణాళికలు అమలు కాకుండా చేశాడని పేర్కొన్నాడు. ‘మేం నిర్దేశించింది మంచి లక్ష్యమే. ఈ పిచ్‌పై ఎంత కావాలో అంత లక్ష్యం ప్రత్యర్థి ముందు ఉంచాం. అయితే ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా ఆడారు. ఈ విజయానికి వాళ్లు పూర్తి అర్హులు. ఢిల్లీ ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ కలిసికట్టుగా రాణించారు. అయితే మాకు వచ్చిన అవకాశాలను జారవిడిచాం. ఈ మ్యాచ్‌లో వందశాతం రాణించామని చెప్పడం లేదు. ఎందుకంటే ఇలాంటి కీలకమైన మ్యాచ్‌ల్లో ప్రతీ ఆటగాడు రాణించాల్సి ఉంటుంది. కానీ, మా జట్టులో అలా జరగలేదు. డేవిడ్ వార్నర్‌, బెయిర్‌స్టో లేకుండా బరిలో దిగిన మ్యాచ్‌ల్లోనూ బాగానే ఆడాం. అయితే, చాలా మ్యాచ్‌ల్లో విజయతీరాలకు వచ్చి ఓడిపోయాం. వచ్చే సీజన్‌లో మరింత రాణించేందుకు కృషి చేస్తాం’ అని విలియమ్సన్‌ వివరించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top