అతని కోసం ప్రణాళిక సిద్ధం చేశాం: చహల్‌

We have a plan for Andre Russell, Chahal warns West Indies - Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో అపజయం లేకుండా దూసుకుపోతున్న భారత క్రికెట్‌ జట్టు తమ తదుపరి పోరులో వెస్టిండీస్‌తో తలపడనుంది. గురువారం మాంచెస్టర్‌ వేదికగా ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో విండీస్‌ ఆటగాళ్ల కోసం వ్యూహ రచనలు చేస్తోంది భారత్‌. హార్డ్‌ హిట్టర్లు ఎక్కువగా ఉన్న విండీస్‌ జట్టును కట్టడి చేయడంపైనే దృష్టి సారించామని టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ తెలిపాడు.

‘దేశం కోసం ఆడటం వేరు.. ఐపీఎల్‌ వంటి లీగ్‌లో ఆడటం వేరు. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఐపీఎల్‌కు వరల్డ్‌కప్‌కు ఎంతమాత్రం పోలిక లేదు. దేశం తరఫున సమిష్టిగా ఆడటంపైనే మా దృష్టి ఉంది. ఒత్తిడిని అధిగమిస్తేనే వరల్డ్‌కప్‌ వంటి మెగా టోర్నీల్లో విజయం సాధిస్తాం. వెస్టిండీస్‌ చాలా ప్రమాదకరమైన జట్టు. ఆ జట్టులో అంతా హార్డ్‌ హిట్టర్లే. మాతో జరుగనున్న పోరులో వారు కచ్చితంగా ఫామ్‌ను చాటుకుని తిరిగి గాడిలో పడటానికి యత్నిస్తారు. దాంతో మేము కచ్చితమైన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం’ అని చహల్‌ పేర్కొన్నాడు.

ఇక విండీస్‌ ఆల్‌ రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ కోసం ఏమైనా ప్రణాళిక సిద్ధం చేశారా? అని అడిగిన ప్రశ్నకు చహల్‌ అవుననే సమాధానం చెప్పాడు. ‘  రసెల్‌ కోసం గేమ్‌ ప్లాన్‌ ఉంది. అతనొక హార్డ్‌ హిట్టర్‌. కానీ మేము చాలా మ్యాచ్‌ల్లో అతనికి బంతులు వేశాం. అతని ఆట తీరుపై అవగాహన ఉంది. రసెల్‌ ఎప్పుడూ సహజ సిద్ధంగా ఆడటానికి యత్నిస్తాడు. అప్పటి పరిస్థితుల్ని మా ప్రణాళికలు మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది’ అని చహల్‌ తెలిపాడు.


 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top