‘నేను కెప్టెన్‌ ఎందుకు కాకూడదు’

Was Not Emotional When I Got The Cap, Shreyas Iyer - Sakshi

న్యూఢిల్లీ:  వరల్డ్‌కప్‌ నుంచి టీమిండియా నేర్చుకున్న గుణపాఠం ఏదైనా ఉందంటే నాల్గో స్థానంపై ఫోకస్‌ చేయడమే. ఈ స్థానంపై ఎట్టకేలకు సమాధానం దొరికింది టీమిండియా మేనేజ్‌మెంట్‌కు. అది శ్రేయస్‌ అయ్యర్‌ రూపంలో భారత్‌కు నాల్గో స్థానంపై భరోసా దొరికింది. దాంతోనే శ్రేయస్‌ అయ్యర్‌కు వరుసగా అవకాశాలు ఇస్తూ అదే స్థానంలో పదే పదే పరీక్షిస్తూ వస్తున్నారు. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది .ఈ స్థానంలో అయ‍్యర్‌ తన పాత్రకు న్యాయం చేస్తూ జట్టు మేనేజ్‌మెంట్‌ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇప్పటివరకూ అయ్యర్‌ ఆడిన వన్డేలు 18 కాగా, 22 అంతర్జాతీయ టీ20లు ఆడాడు.  అయితే 40 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉ‍న్న  అయ్యర్‌ 3,4,5,6 స్థానాల్లో బ్యాటింగ్‌ చేశాడు. కాగా, నాల్గో స్థానంలోనే అతని సగటు మెరుగ్గా ఉందనే విషయం గణాంకాలే చెబుతున్నాయి. ఇక్కడ అయ్యర్‌ ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 56.00 సగటుతో  396 పరుగులు నమోదు చేసి ఈ స్థానం తనదేనని చెప్పకనే చెప్పేశాడు.(సే‘యస్‌’ అయ్యర్‌)

అయితే ఏదొక రోజు భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌ అవుతాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు శ్రేయస్‌ అయ్యర్‌. తనకు భారత జట్టులో అవకాశం వచ్చినప్పుడు పెద్దగా ఎమోషనల్‌ ఏమీ కాలేదని, తనకు ఎప్పుడో అవకాశం వస్తుందని ఆశించానని, ఆలస్యంగానైనా అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా అయ్యర్‌ తెలిపాడు. దీనిలో భాగంగా పలు విషయాలను అయ్యర్‌ చెప్పుకొచ్చాడు. ‘ నా బ్యాటింగ్‌ను ఒకరోజు రాహుల్‌ ద్రవిడ్‌ సర్‌ చూశారు. అది నాలుగు రోజుల క్రికెట్‌ మ్యాచ్‌. తొలి రోజు చివరి ఓవర్‌లో నా ఆటను ద్రవిడ్‌ సర్‌ చూశారు. అప్పటికి నేను సుమారు 30 పరుగులు చేసి ఉన్నా. అది చివరి ఓవర్‌ కాబట్టి కూల్‌ ఆడాలి. కానీ నేను బౌలర్‌ ఊరిస్తూ బ్యాట్‌పైకి వేసిన బంతిని సిక్స్‌ కొట్టా. ఆ సమయంలో అది అవసరం లేదు. కానీ నేను మాత్రం ముందుకొచ్చి ఆ బంతిని సిక్స్‌ కొట్టా. అలా ద్రవిడ్‌ సర్‌ దృష్టిలో పడ్డా’ అని అయ్యర్‌ తెలిపాడు.

ఏదొక రోజు నేనూ కెప్టెన్‌ అవుతా
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అయ్యర్‌కు భారత జట్టుకు కెప్టెన్‌ అవుతాననే ధీమాలో ఉన్నాడు.  మీకు టీమిండియాకు కెప్టెన్‌గా చేయాలని ఉందనే ఒక ప్రశ్నకు సమాధానంగా అవుననే సమాధానమిచ్చాడు అయ్యర్‌. ‘ భవిష్యత్తులో ఏదొకరోజు టీమిండియా కెప్టెన్‌ అవుతానన్నాడు. ప్రస్తుతానికి తనకు ఆ ఆలోచన లేకపోయినా, ఏదొక రోజు తనకు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే దాని గురించి ఇప్పట్నుంచే పెద్దగా ఆలోచనలు ఏమీ లేవన్నాడు. ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని అ‍య్యర్‌ తెలిపాడు. తనకు గేమ్‌పై ఫోకస్‌ చేస్తూ మరింత రాటుదేలడమే ఇప్పుడున్న లక్ష్యమన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top