‘అందుకే విశ్రాంతి తీసుకున్నా’

Virat Kohli Explain The Absence From Asia Cup 2018 - Sakshi

రాజ్‌కోట్‌: ప్రత్యర్థి బౌలర్లకు దొరకని సమాధానంగా మారాడు. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతమున్న ఏ ఇతర బ్యాట్స్‌మన్‌ రాణించని చోట ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నాడు. ఈ ఘనతలన్నీ పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్న టీమిండియా సారథి విరాట్‌ కోహ్లికి చెందుతాయి. ఇంగ్లండ్‌లో అసాధారణ రీతిలో చెలరేగి ఆడిన కోహ్లికి ఆసియా కప్‌ ముందు విమర్శల సెగ తగిలింది. యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌కు తాను ఆడనని, విశ్రాంతి అవసరమని తెలపడంతో క్రీడా పండితులు విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ విషయంపై ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి వివరణ ఇవ్వగా, తాజాగా విరాట్‌ కోహ్లి స్పందించాడు. (కోహ్లిని ఎద్దుతో పోల్చిన రవిశాస్త్రి)

‘ఇంగ్లండ్‌తో సిరీస్‌ అనంతరం శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోయాను. అందుకే తప్పనిసరిగా విశ్రాంతి కావాలని సెలక్టర్లను అడిగా. వారు నా పరిస్థితి అర్థం చేసుకొని ఆసియాకప్‌కు విశ్రాంతినిచ్చారు. అంతేకాని ఆసియ కప్‌ మీద చిన్నచూపు కాదు. విశ్రాంతి అనంతరం కొత్త శక్తి, ఉత్సాహం, పునరుత్తేజం లభిస్తుంది ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే ఆటగాడు అలసిపోతాడని అందరూ అనుకుంటారు. కానీ ఆ భావన తప్పు. ఆడిన మ్యాచ్‌ల్లో పరుగులు సాధించకపోతే ఆ ఆటగాడికి ఎలాంటి వర్క్‌లోడ్‌ ఉండదు. మ్యాచ్‌లు ఎక్కువ ఆడినంత మాత్రాన వర్క్‌లోడ్‌ అనిపించదు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో వర్క్‌లోడ్‌ ఎక్కువగా ఉంటే తొందరగా అలసిపోతాం. ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో వర్క్‌లోడ్‌ ఎక్కువగా అనిపించింది’.అంటూ విరాట్‌ కోహ్లి విశ్రాంతి గురించి వివరణ ఇచ్చాడు. ఇక కోహ్లి గైర్హాజర్‌తో రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా ఏడో సారి ఆసియాకప్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: 

కోహ్లి ఒంటిపై ఉన్న టాటూలు ఏంటో తెలుసా?

కోహ్లికి రెస్ట్‌.. రోహిత్‌కు పగ్గాలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top