నభూతో... నభవిష్యతి! | Usain Bolt and Jamaica win 4x100m relay gold in Rio | Sakshi
Sakshi News home page

నభూతో... నభవిష్యతి!

Aug 21 2016 1:28 AM | Updated on Sep 4 2017 10:06 AM

నభూతో...   నభవిష్యతి!

నభూతో... నభవిష్యతి!

అపరాజితుడు... ఎవరూ అందుకోలేనివాడు... అందరిలో అత్యుత్తముడు... యుగానికొక్కడు... ఇంకా ఏమైనా విశేషణాలు ఉంటే

బోల్ట్ ఖాతాలో తొమ్మిదో స్వర్ణం
4*100 రిలేలోనూ పసిడి పతకం
‘ట్రిపుల్’ ట్రిపుల్ సాధించిన జమైకా స్టార్
చివరి ఒలింపిక్స్ ఆడేసిన ‘స్ప్రింట్ కింగ్’


అపరాజితుడు... ఎవరూ అందుకోలేనివాడు... అందరిలో అత్యుత్తముడు... యుగానికొక్కడు... ఇంకా ఏమైనా విశేషణాలు ఉంటే అవన్నీ తనకే చెందాలని జమైకా పరుగువీరుడు ఉసేన్ బోల్ట్ స్పష్టం చేశాడు. తన ఒలింపిక్స్ కెరీర్‌ను తాను కోరుకున్నట్లే అజేయుడిగా ముగించాడు. వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ మూడు స్వర్ణాలు సాధించి ‘ట్రిపుల్’ ఘనతను మూడోసారి పునరావృతం చేశాడు. ప్రస్తుతం ప్రపంచ అథ్లెటిక్స్ పరిస్థితిని పరిశీలిస్తే బోల్ట్ ఒలింపిక్స్ ‘ట్రిపుల్ గోల్డ్’ రికార్డు భవిష్యత్‌లో బద్దలయ్యే అవకాశం కనిపించడంలేదు. బోల్ట్‌లాంటి అథ్లెట్ మరొకరు వచ్చినా ఈ ‘జమైకా చిరుత’ రికార్డు కనీసం 12 ఏళ్లపాటు చెక్కు చెదరకుండా ఉంటుంది.

 

రియో డి జనీరో: అదే ట్రాక్... అదే ఫలితం... అదే పతకం... విభాగం మారినా పతకం రంగు మారలేదు. జమైకా ‘స్ప్రింట్ కింగ్’ ఉసేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్‌ను ఘనంగా ముగించాడు. శనివారం జరిగిన పురుషుల 4ఁ100 మీటర్ల రిలేలో బోల్ట్ సభ్యుడిగా ఉన్న జమైకా బృందం స్వర్ణ పతకాన్ని సాధించింది. అసాఫా పావెల్, యోహాన్ బ్లేక్, నికెల్ యాష్మెడ్, బోల్ట్‌లతో కూడిన జమైకా జట్టు 37.27 సెకన్లలో పోటీని ముగించి అగ్రస్థానంలో నిలిచింది. జపాన్ జట్టు (37.60 సెకన్లు) రజతం సొంతం చేసుకోగా... కెనడా జట్టు (37.64 సెకన్లు) ఖాతాలో కాంస్యం చేరింది. వాస్తవానికి అమెరికా జట్టుకు మూడో స్థానం లభించింది. అయితే అమెరికా అథ్లెట్ మైక్ రోడ్‌జర్స్ బ్యాటన్‌ను తన సహచరుడు జస్టిన్ గాట్లిన్‌కు నిర్ణీత వ్యవధిలో అందించడంలో విఫలమయ్యాడని రిప్లేలో తేలింది. దాంతో అమెరికా జట్టుపై అనర్హత వేటు వేశారు. దీంతో నాలుగో స్థానంలో నిలిచిన కెనడాకు కాంస్య పతకాన్ని ఖరారు చేశారు. 1995 నుంచి ఇప్పటివరకు రిలే రేసుల్లో అమెరికా జట్టుపై అనర్హత వేటు పడటం తొమ్మిదోసారి కావడం గమనార్హం.

 
అందనంత వేగంగా...

రిలే రేసు తొలి అంచెలో అసాఫా పావెల్ పరుగెత్తి... రెండో అంచెలో ఉన్న బ్లేక్‌కు బ్యాటన్ అందించాడు. అతను కూడా వేగంగా దూసుకెళ్లి మూడో అంచెలో యాష్మెడ్‌కు ఇచ్చాడు. యాష్మెడ్ ద్వారా నాలుగో అంచెలో బోల్ట్ బ్యాటన్ అందుకున్నాడు. అప్పటికే అస్కా కేంబ్రిడ్జ్ (జపాన్), ట్రెవెన్ బ్రోమెల్ (అమెరికా) బోల్ట్ కంటే ముందుకు వెళ్లిపోయారు. అయితే తన చేతికి బ్యాటన్ అందగానే బోల్ట్ పెద్ద పెద్ద అంగలు వేస్తూ 30 మీటర్లలోపే ఈ ఇద్దరిని వెనక్కి నెట్టాడు. మిగతా 70 మీటర్లను బోల్ట్ వాయువేగంతో పరుగెత్తి లక్ష్యానికి చేరుకున్నాడు. ఈసారి కూడా జమైకా బృందం కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పలేకపోయినా లండన్ ఒలింపిక్స్‌కంటే మెరుగైన సమయాన్ని నమోదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement