థండర్‌ బోల్ట్‌ దెబ్బకు కుప్పకూలిన పాకిస్తాన్

Trent Boult super performance; Pakistan loss ODI series - Sakshi

కివీస్‌తో వన్డే సిరీస్‌లో వైట్‌వాష్‌

డునెదిన్ : న్యూజిలాండ్‌ స్పీడ్‌స్టర్‌ ట్రెంట్‌ బోల్ట్‌ ధాటికి విలవిడలాడిన పాకిస్తాన్‌.. 0-3 తేడాతో సిరీస్‌ను సమర్పించుకుంది. శనివారం డునెదిన్‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో కివీస్‌ విసిరిన 258 పరుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆడిన పాక్‌.. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేక 74 పరుగులకే కుప్పకూలింది. తద్వారా వన్డే చరిత్రలో పాక్‌ తన రెండో అత్యల్ప స్కోరును సమం చేసింది. 1992 ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో పాక్‌ 74కే ఆలౌటైంది. ఇక 1993లో విడీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగులు.. వన్డే చరిత్రలో పాక్‌ అత్యల్ప స్కోరుగా రికార్డయింది.

థండర్‌ బోల్ట్‌ : వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలమైన పాక్‌ కనీసం మూడో మ్యాచ్‌లోనైనా పరువునిలబెట్టుకోవాలనుకుంది. 258 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాక్‌ను.. బోల్ట్‌ మట్టికరిపించాడు. మొదటి స్పెల్‌లోనే ముగ్గురు టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్లను పెవీలియన్‌కు పంపాడు. ఒక దశలో పాక్‌ కేవలం 16 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్సమన్లలో ఏ ఒక్కరూ రెండంకెల స్కోరు సాధించలేదు. నాలుగోడౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌(14)దే వ్యక్తిగతంగా అత్యుత్తమ స్కోరు. కేవలం 27.2 ఓవర్లు ఆడిన పాక్‌ 74 పరుగులకు ఆలౌట్‌అయి.. 183 పరుగుల తేడాతో ఓడిపోయింది. 7.2 ఓవర్లేసిన బోల్ట్‌ 17 పరుగులిచ్చి 5 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఫెర్గ్యూసన్‌, మున్రోలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 50 ఓవర్లలో 257 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్స్‌ 73, రాస్‌టేలర్‌ 52 పరుగులతో రాణించారు. ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ 45 పరుగులు, మిడిలార్డర్‌లో వచ్చిన లాథమ్‌ 35 పరుగులు సాధించారు. పాక్‌ బౌలర్లలో రయీస్‌, హసన్‌ అలీలు చెరో 3 వికెట్లు పడగొట్టగా, షబాబ్‌ 2, అష్రాఫ్‌ ఒక వికెట్‌ నేలకూల్చారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top