టోక్యోకే పట్టం | Tokyo celebrates an emotional Olympics victory | Sakshi
Sakshi News home page

టోక్యోకే పట్టం

Sep 9 2013 2:05 AM | Updated on Sep 1 2017 10:33 PM

టోక్యోకే పట్టం

టోక్యోకే పట్టం

విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ క్రీడలను రెండో సారి నిర్వహించే అవకాశం జపాన్ రాజధాని నగరం టోక్యోకు దక్కింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు ఇక్కడ జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశంలో 2020 ఒలింపిక్స్ వేదికగా టోక్యోను ప్రకటించారు.

బ్యూనస్ ఎయిర్స్: విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ క్రీడలను రెండో సారి నిర్వహించే అవకాశం జపాన్ రాజధాని నగరం టోక్యోకు దక్కింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు ఇక్కడ జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశంలో 2020 ఒలింపిక్స్ వేదికగా టోక్యోను ప్రకటించారు. ఇందు కోసం జరిగిన ఓటింగ్‌లో టోక్యో 24 ఓట్ల తేడాతో ఇస్తాంబుల్ (టర్కీ)పై స్పష్టమైన ఆధిక్యం సాధించింది. టోక్యోకు మొత్తం 60 ఓట్లు పోల్ కాగా, ఇస్తాంబుల్‌కు 36 మాత్రమే దక్కాయి. పోటీలో నిలిచిన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది.
 
 ఈ రౌండ్‌లో జపాన్‌కు 42 ఓట్లు రాగా, ఇస్తాంబుల్, మాడ్రిడ్‌లకు సమానంగా 26 ఓట్లు వచ్చాయి. అయితే టైబ్రేకర్‌లో 49-45 తేడాతో మాడ్రిడ్‌ను ఓడించి ఇస్తాంబుల్ ముందంజ వేసింది. ఒక దశలో ఇస్తాంబుల్ నెగ్గిందనుకొని కొందరు అభిమానులు సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే అది రెండో రౌండ్‌లోకి మాత్రమే ప్రవేశించిందని తర్వాత తెలిసింది. 1964లో కూడా టోక్యో ఒలింపిక్స్ నిర్వహించింది. రెండో సారి అవకాశం దక్కించుకున్న తొలి ఆసియా నగరం ఇదే కావడం విశేషం.
 
 అందుకే అవకాశం...
 రెండు ఖండాలు-రెండు సంస్కృతులు అంటూ ఇస్తాంబుల్ చేసిన ప్రచారం వృథా కాగా... మాంద్యం కారణంగా బలహీనంగా మారిన స్పెయిన్ ఆర్ధిక స్థితిపై అపనమ్మకం మాడ్రిడ్‌కు అవకాశాన్ని దూరం చేసింది. 2020 ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం దక్కించుకున్న టోక్యోకు ఐఓసీ అధ్యక్షుడు జాక్వస్ రోగె అభినందలు తెలిపారు. ఈ మంగళవారంతో రోగె 12 ఏళ్ల పదవీ కాలం పూర్తి కానుంది. ‘టోక్యో బిడ్ సాంకేతికంగా చాలా బలంగా ఉంది. మూడు నగరాలకు కూడా క్రీడలను నిర్వహించే సత్తా ఉన్నా... చివరకు ఐఓసీ సభ్యులలో ఎక్కువ మందిని టోక్యో బిడ్ ఆకట్టుకుంది. రాబోయే తరానికి ఒలింపిక్ విలువలు, క్రీడల ఫలితాలు అందించే క్రమంలో అద్భుతమైన, సురక్షితమైన క్రీడలను నిర్వహిస్తామంటూ (డిస్కవర్ టుమారో) పేరుతో జపాన్ ఇచ్చిన పిలుపు టోక్యో నగరానికి అవకాశం కల్పించింది’ అనిరోగె వెల్లడించారు.
 
 సంతోషం...
 ఫకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న రేడియో ధార్మికత జపాన్ ఒలింపిక్ బిడ్‌కు అడ్డంకిగా మారవచ్చని వినిపించింది. అయితే పరిస్థితి అదుపులో ఉందంటూ, భవిష్యత్తులోనూ ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని జపాన్ బృందం తగిన వివరణ ఇచ్చింది. టోక్యోను ఎంపిక చేయగానే ఆ దేశ ప్రజలు నగర వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. తమ దేశానికి మళ్లీ ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం రావడం పట్ల ఆ దేశ ప్రధాని షిన్జో ఆబె ఆనందం వ్యక్తం చేశాడు. ‘ఒలింపిక్ ఉద్యమంలో ఉన్నవారందరికీ నా కృతజ్ఞతలు. మేం ఈ క్రీడలను అద్భుతంగా నిర్వహిస్తాం. రెండేళ్ల క్రితం సునామీ సమయంలో మాకు అండగా నిలిచిన ప్రపంచానికి రుణపడి ఉన్నాం. ఒలింపిక్స్‌తో ఆ అప్పుడు కూడా తీర్చేస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
 
 గత 15 ఏళ్లుగా ఒడిదుడుకులకు లోనైన జపాన్ ఆర్ధిక స్థితికి ఒలింపిక్స్ నిర్వహణ ఊపు తెస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. బిడ్‌కు నేతృత్వం వహించిన జపాన్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు సునేకాజు తకేడా మాట్లాడుతూ...‘టోక్యో ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. జపాన్ వెళ్లగానే మా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలపడమే నేను చేసే మొదటి పని’ అని వ్యాఖ్యానించారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి కోలుకొని కొత్త ఉత్సాహంతో టోక్యో ముందుకు వెళ్లేందుకు ఒలింపిక్స్ తోడ్పడతాయని నగర గవర్నర్ ఇనోస్ చెప్పారు.
 
 
 టోక్యో 2020 విశేషాలు
 ఒలింపిక్స్ చరిత్ర: 1964లో టోక్యో తొలిసారి ఈ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. సపోరో (1972), నగానో (1998)లలో రెండు సార్లు వింటర్ ఒలింపిక్స్ కూడా జపాన్ నిర్వహించింది. 2020లో టోక్యోలోనే పారాలింపిక్స్ కూడా జరుగుతాయి.
 అంచనా వ్యయం: రూ. 54 వేల 87 కోట్లు (సుమారు)
 ప్రతిపాదిత వేదికలు: మొత్తం 36 (ప్రస్తుతం 15, కొత్తవి 11, తాత్కాలికం 10)
 ప్రధాన స్టేడియం: 1964 క్రీడలు జరిగిన చోటే పాతదానిని పునరుద్ధరించి 80 వేల సామర్ధ్యంతో కొత్త స్టేడియం నిర్మాణం.
 రవాణా: ఇప్పటికే చక్కటి సౌకర్యం ఉన్న నగరంలో కొత్తగా ఎలాంటి మౌలిక సౌకర్యాలూ అభివృద్ధి చేయడం లేదు.
 వసతి: 50 కిలోమీటర్ల నగర పరిధిలో 1,40,000 హోటల్ గదులు, 9,500 ఇతర గదులు అందుబాటులో ఉన్నాయి. ఫైవ్ స్టార్ గదుల గరిష్ట అద్దె రూ. 1 లక్షా 6 వేలు.
 భద్రతా సిబ్బంది: 50 వేల మంది (ఇందులో 14 వేలు ప్రైవేట్ సెక్యూరిటీ)
 
 
 షాక్‌కు గురయ్యాను....
 ఒలింపిక్స్ నిర్వహణ కోసం మాడ్రిడ్‌కు అవకాశం దక్కకపోవడం పట్ల స్పెయిన్ స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ విస్మయం వ్యక్తం చేశాడు. మాడ్రిడ్ బిడ్ తరఫున నాదల్ సుదీర్ఘ కాలంగా ప్రచారం చేస్తున్నాడు.
 
 ఇది తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని అతను అన్నాడు. ‘స్పెయిన్ రాజధాని పట్ల ఐఓసీ సరిగా వ్యవహరించలేదు. ఒలింపిక్స్ అవకాశం దక్కించుకునేందుకు మా దేశ ప్రజలు ఎన్నో ఏళ్లు శ్రమించారు. మాకా అర్హత ఉందని మేం భావించాం. ప్రచారంలో కూడా మేం ముందున్నాం కాబట్టి తాజా నిర్ణయం తీవ్రంగా నిరాశ పరచింది’ అని నాదల్ వ్యాఖ్యానించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement