విజయంతో వీడ్కోలు | To the success of goodbye to spain | Sakshi
Sakshi News home page

విజయంతో వీడ్కోలు

Jun 24 2014 1:10 AM | Updated on Oct 22 2018 5:58 PM

విజయంతో వీడ్కోలు - Sakshi

విజయంతో వీడ్కోలు

డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ నామమాత్రపు మ్యాచ్‌లో తమ సత్తా ప్రదర్శించి టోర్నీ నుంచి నిష్ర్కమించింది.

ఆసీస్‌పై 3-0తో స్పెయిన్ గెలుపు
 
కురిటీబా: డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ నామమాత్రపు మ్యాచ్‌లో తమ సత్తా ప్రదర్శించి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఇప్పటికే రెండు పరాజయాలతో నాకౌట్‌కు దూరమైన ఈ జట్టు ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం చెలరేగి 3-0తో నెగ్గింది. ఈ గెలుపుతో సాధించేదేమీ లేకున్నా తమ మునుపటి ఆటతీరును ప్రదర్శించి అభిమానులను ఆకట్టుకుంది. వేగవంతమైన పాస్‌లతో చురుగ్గా కదిలి ఓదార్పు విజయాన్ని దక్కించుకుని తమ గ్రూప్ ‘బి’లో చిట్టచివర నిలిచే ప్రమాదాన్ని తప్పించుకుంది. విల్లా, టోరెస్, మటా జట్టు తరఫున గోల్స్ సాధించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా డేవిడ్ విల్లా నిలిచాడు.

⇒    ఫలితం ఎలావచ్చినా ఒరిగేదేమీ లేదనుకున్నారేమో కానీ స్పెయిన్ ఆటగాళ్లు మ్యాచ్ ప్రారంభం నుంచే వేగంగా ఆడారు. వరుస దాడులతో ఆసీస్‌ను బెంబేలెత్తించారు.
⇒   17వ నిమిషంలో గోల్ చేసేందుకు స్పెయిన్‌కు అవకాశమొచ్చింది. ఇనెస్టా పాస్‌ను మిడ్ ఫీల్డర్ సాంటీ కజోర్లా గోల్ పోస్టులోకి పంపినా కీపర్‌కు ముందే ఆసీస్ డిఫెండర్ స్పిరనోవిక్ అడ్డుకున్నాడు.
⇒   ఆ తర్వాత గోల్ పోస్టుకి 30 గజాల దూరం నుంచి ఫ్రీకిక్ లభించినా ఇనెస్టా షాట్ వైడ్‌గా వెళ్లింది.
⇒    వీరి ప్రయత్నాలు 36వ నిమిషంలో ఫలించాయి. ఆసీస్ డిఫెండర ్లను తప్పిస్తూ ఇనెస్టా.. జువాన్‌ఫ్రాన్‌కు పాస్ ఇవ్వగా వెంటనే తను బంతిని డేవిడ్ విల్లా వైపు పంపించాడు. దీన్ని విల్లా తన కుడి కాలుతో వెనక నుంచి బంతిని అద్భుత రీతిలో గోల్ పోస్టులోకి పంపాడు.
⇒    ద్వితీయార్ధంలోనూ ఇదే రీతిన చెలరేగిన స్పెయిన్ 69వ నిమిషంలో రెండో గోల్ సాధించి జట్టు ఆధిక్యాన్ని 2-0కి పెంచుకుంది. ఆసీస్ డిఫెన్స్‌ను ఛేదిస్తూ ఇనెస్టా ఇచ్చిన సూపర్ పాస్‌ను అందుకున్న ఫెర్నాండో టోరెస్ తడబడకుండా గోల్ చేశాడు. ఇది తనకు 2006 టోర్నీ తర్వాత ఇదే తొలి గోల్.
⇒    82వ నిమిషంలో జువాన్ మటా గోల్ కీపర్ రియాన్ కాళ్ల మధ్యలో నుంచి కొట్టిన గోల్‌తో జట్టుకు తిరుగులేని ఆధిక్యం లభించింది.  

Advertisement
 
Advertisement
Advertisement