అమ్మాయిలూ ఓడారు 

Third ODI: Indian women walloped by New Zealand - Sakshi

చివరి వన్డేలో భారత మహిళల ఓటమి

8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ గెలుపు

సిరీస్‌ 2–1తో టీమిండియా వశం

6 నుంచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌  

న్యూజిలాండ్‌ గడ్డపై టీమిండియా పురుషుల, మహిళల క్రికెట్‌ జట్ల ప్రయాణం ఒకే విధంగా సాగుతోంది. హామిల్టన్‌లో గురువారం తన 200వ వన్డేలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్‌ శర్మకు పరాజయం ఎదురవగా... అదే వేదికలో శుక్రవారం రికార్డు స్థాయిలో 200వ మ్యాచ్‌ ఆడిన అమ్మాయిల సారథి మిథాలీ రాజ్‌కూ ఓటమి అనుభవమే మిగిలింది. ఈ ఫలితంతో సంబంధం లేకుండా రెండు జట్లూ వన్డే సిరీస్‌ను ముందుగానే కైవసం చేసుకోవడం గమనార్హం కాగా, టాస్‌ ఓడి   బ్యాటింగ్‌కు దిగిన పరిస్థితుల్లో మ్యాచ్‌లు చేజార్చుకోవడం విశేషం.  

హామిల్టన్‌: ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా రెండు వన్డేల్లో చెలరేగి ఆడి సిరీస్‌ను గెల్చుకున్న భారత మహిళల జట్టు చివరిదైన మూడో వన్డేలో ఓటమి పాలైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు... కివీస్‌ ఆఫ్‌ స్పిన్నర్, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అనా పీటర్సన్‌ (4/28), పేసర్‌ లీ మేరీ తహుహు (3/26) ధాటికి తడబడ్డారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ దీప్తి శర్మ (90 బంతుల్లో 52; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (40 బంతుల్లో 24; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది.

కెరీర్‌లో 200వ వన్డే ఆడిన కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (9) సహా ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు జెమీమా రోడ్రిగ్స్‌ (12), స్మృతి మంధాన (1) నిరాశపర్చారు. ఓ దశలో 35 ఓవర్లకు 115/4తో ఉన్న జట్టు బ్యాటర్ల వైఫల్యంతో 44 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌటైంది. మరో స్పిన్నర్‌ అమేలియా కెర్‌ (2/43)కు రెండు వికెట్లు దక్కాయి. ఓపెనర్‌ సుజీ బేట్స్‌ (64 బంతుల్లో 57; 8 ఫోర్లు, 1 సిక్స్‌); కెప్టెన్‌ సాటర్‌వైట్‌ (74 బంతుల్లో 66 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో రాణించడంతో ఆతిథ్య జట్టు 29.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బేట్స్, సాటర్‌వైట్‌ రెండో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. భారత ఓపెనర్‌ స్మృతికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ దక్కింది. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఈ నెల 6 నుంచి జరుగనుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top