బంగ్లా ప్రేక్షకులు మద్దతివ్వరు

There Is No Support From Bangladesh Audience Says Rohit Sharma - Sakshi

భారత స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ

న్యూఢిల్లీ: కేవలం బంగ్లాదేశ్‌లో మాత్రమే టీమిండియాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించదని భారత స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. శనివారం బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌తో ఫేస్‌బుక్‌ లైవ్‌ చాట్‌లో సరదాగా ముచ్చటించిన రోహిత్‌ శర్మ... సంధి దశను అధిగమించి బంగ్లాదేశ్‌ ఎదిగిన తీరును అభినందించాడు. ‘భారత్, బంగ్లాదేశ్‌లలో క్రికెట్‌ వీరాభిమానులు ఉంటారు. వారు ఎంతగా ఆరాధిస్తారో ఆటలో మనవల్ల ఏదైనా తప్పు జరిగితే అంతే తీవ్రంగా విమర్శిస్తారు. బంగ్లాదేశ్‌లో మరీ ఎక్కువగా క్రికెట్‌ను ఆరాధిస్తారు. భారత్‌ అక్కడ మ్యాచ్‌ ఆడితే మాకు ప్రేక్షకుల నుంచి కనీస మద్దతు లభించదు. ఇదే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మాకు మద్దతు దొరకని ప్రదేశం ఏదైనా ఉందంటే అది బంగ్లాదేశ్‌ మాత్రమే’ అని రోహిత్‌ సరదాగా వ్యాఖ్యానించాడు.

ఐసీసీ టోర్నీల్లో బంగ్లాపై చెలరేగే రోహిత్‌ కారణంగా తమ అభిమానుల నుంచి తాను తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నానని తమీమ్‌ గుర్తు చేసుకున్నాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను తమీమ్‌ వదిలేయడంతో సెంచరీతో చెలరేగిన ‘హిట్‌మ్యాన్‌’ భారత్‌ను గెలిపించాడు. ‘రోహిత్‌ భాయ్‌ మాపైనే నీ ప్రతాపం చూపిస్తావెందుకు? 2015 ప్రపంచకప్‌ క్వార్టర్స్‌లో ఓ సెంచరీ, 2017 చాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌లో మరో సెంచరీ, మొన్నటి ప్రపంచకప్‌లో నా పొరపాటు కారణంగా మరో సెంచరీ చేశావు. అప్పుడు ప్రేక్షకులు స్పందించిన తీరు నాకింకా గుర్తుంది. ఇక చేసేదేం లేక ఎలాగైనా నువ్వు ఔటవ్వాలని నేను కోరుకున్నా. కానీ నువ్వు 40 పరుగులకు చేరుకోగానే ఏం జరుగబోతుందో నాకు అర్థమైంది’ అంటూ తమీమ్‌ నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top