
'మా క్రికెట్ టీమ్ లో చాలా సమస్యలున్నాయి'
తాజాగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ ను పాకిస్థాన్ కోల్పోవడం పట్ల ఆ జట్టు ప్రధాన కోచ్ వకార్ యూనస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
కరాచీ: తాజాగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ ను పాకిస్థాన్ కోల్పోవడం పట్ల ఆ జట్టు ప్రధాన కోచ్ వకార్ యూనస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే రెండు వన్డేలు కోల్పోయి సిరీస్ ను చేజార్చుకోవడం తనను తీవ్రంగా కలచి వేసిందన్నాడు. గత కొంతకాలం నుంచి పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పై విమర్శకుల చేస్తున్న వ్యాఖ్యలతో ఏకీభవించక తప్పదన్నాడు.
'మా జట్టులో చాలా సమస్యలున్నాయి. అయితే టీమ్ ను విజయాల బాట పట్టించడానికి సమయం పడుతుంది. జరగబోయే దాని గురించి నిరీక్షిద్దాం' అని వకార్ తెలిపాడు. ప్రస్తుతం కొత్త ఆటగాళ్లతో సరికొత్తగా తీర్చిదిద్దడానికి యత్నాలు చేస్తున్నట్లు తెలిపాడు. 16 ఏళ్ల తరువాత పాకిస్థాన్ జట్టు బంగ్లాపై సిరీస్ ను కోల్పోవడం ఇదే ప్రథమం.