ఐపీఎల్‌లో ‘వరల్డ్‌కప్‌’ ఆటగాళ్లు.. ప్చ్‌!

Team India Players Performance In IPL 2019 Season - Sakshi

క్రికెట్ అభిమానుల్ని 51 రోజులపాటు ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2019 సీజన్‌ ముగిసింది. ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ పోరాడిన ముంబై ఇండియన్స్‌ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో రోహిత్‌ సేన ఖాతాలో నాలుగో ఐపీఎల్‌ టైటిల్‌ చేరింది. ఇక ఫైనల్‌ మ్యాచ్‌లో గాయం కూడా లెక్క చేయకుండా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన షేన్‌ వాట్సన్‌కు సీఎస్‌కే అభిమానులు ఫిదా అయ్యారు. ఐపీఎల్‌ సమరం ముగిసింది మరి నెక్ట్స్‌ ఏంటి? అంటే ఇంకేంటి ప్రపంచకప్‌ కదా అంటున్నారు టీమిండియా ఆటగాళ్లు, అభిమానులు.

అయితే ప్రపంచకప్‌లో పాల్గొనబోయే టీమిండియా ఎంపిక పట్ల మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. యువ సంచలనం రిషభ్‌ పంత్‌, సీనియర్‌ ఆటగాడు అంబటి రాయుడు, మరో స్పెషలిస్టు పేసర్‌ను తీసుకోకోపోవడంపై సెలక్షన్‌ విధానాన్ని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే మే 30 నుంచి ప్రారంభమయ్యే విశ్వసమరానికి ముందు జరిగిన ఐపీఎల్‌లో వరల్డ్‌కప్‌కు ఎంపికైన భారత జట్టు సభ్యుల ప్రదర్శన ఎలా ఉందో ఓ లుక్‌ వేద్దాం.

కోహ్లి, రోహిత్‌.. ప్చ్‌ 
కనీసం ఈ సారయినా.. అనే నినాదంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఐపీఎల్‌లోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా విరాట్‌ కోహ్లి ఈ సీజన్‌ను సవాల్‌గా తీసుకున్నాడు. అందుకోసం మానసికంగా, శారీరకంగా సిద్దమయ్యాడు. అయితే సీజన్‌ మారినా ఆర్సీబీ తలరాత మారలేదు. అయితే గత సీజన్లతో పోలిస్తే ఈసారి కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ సారి కాస్త పరుగుల ప్రవాహం తగ్గింది. 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 33.14 సగటుతో 464 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్దసెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. 

రోహిత్‌ శర్మ తన జట్టుకయితే నాలుగోసారి టైటిల్‌ అందిచాడు కానీ.. బ్యాట్స్‌మన్‌గా మాత్రం విఫలమాయ్యడు. ఈ సీజన్‌లో రోహిత్‌ మెరుపులు మెరవలేదు. ఇక గాయం కారణంగా ఓ మ్యాచ్‌కు దూరమై భయపెట్టించాడు. ఇక ఈ సీజన్‌లో రోహిత్‌ 15 మ్యాచ్‌ల్లో 28.92 సగటుతో 405 పరుగులు మాత్రమే చేశాడు. 

తాజా ఐపీఎల్‌లో జెర్సీ మార్చి బరిలోకి దిగిన శిఖర్‌ ధావన్‌ పర్వాలేదనిపించాడు. గబ్బర్‌ నుంచి అభిమానులు అశించిన ప్రదర్శన ఇచ్చాడు. కానీ జట్టుకు అవసరమైన దశలో విఫలమవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇక ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన ధావన్‌ ఐదు హాఫ్‌ సెంచరీలతో 521 పరుగులు సాధించాడు. ఇక విదేశీ పిచ్‌లపై ముఖ్యంగా ఇంగ్లండ్‌ గడ్డపై రాణించే ధావన్‌పై అందరి చూపు ఉంది. మరి ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.
    

రాహుల్‌ రాజసం.. ధోని ధనాధన్‌
ఈ సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా, స్టైలీష్‌ ప్లేయర్‌గా రాహుల్‌ నిలిచాడు. ఇక ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన రాహుల్‌ 593 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్దసెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. అయితే నిలకడలేమి రాహుల్‌కు ప్రధాన సమస్య. అది అధిగమిస్తే ప్రపంచకప్‌లో స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ అవడం ఖాయం

వయసు కేవలం సంఖ్య మాత్రమేనని.. వయసుతో ఆటలో మార్పురాదని ఎంఎస్‌ ధోని ఈ సీజన్‌లో నిరూపించాడు. డాడీ ఆర్మీ అంటూ ఎగతాళి చేసినవారికి బ్యాట్‌తో సమాధానమిచ్చాడు. ఇక బెస్ట్‌ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన ఈ జార్ఖండ్‌ డైనమెట్‌ 15 మ్యాచ్‌ల్లో 416 పరుగులు సాధించి సీఎస్‌కే విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ధోని సగటు 83.80గా ఉండటం విశేషం. ఇక ధోనికిదే చివరి ప్రపంచకప్‌ కావడంతో టీమిండియాకు మరోసారి కప్‌ అందిస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 

లక్కీ ప్లేయర్స్‌
టీమిండియాలో వారు రావడం, ఉండటంలో అదృష్టమనేది కీలకపాత్ర. ముఖ్యంగా కేదార్‌ జాదవ్‌ టీమిండియా లక్కీప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అతడున్న చాలా మ్యాచ్‌లు టీమిండియా గెలిచింది. అయితే తాజా ఐపీఎల్‌ సీజన్‌లో జాదవ్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. తను ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 162 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. ఇక కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌ సందర్భంగా గాయపడి ప్లేఆఫ్స్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో ఆడేది కూడా అనుమానంగా ఉంది. అయితే గాయం నుంచి కోలుకున్నా ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. 

అనుభవమనే ఏకైక కారణంతో ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు దినేశ్‌ కార్తీక్‌. లేకుంటే యువ సంచలనం రిషభ్‌ పంత్‌కు చోటు దక్కేది. ఐపీఎల్‌ సీజన్‌ 12ను ఘనంగా ఆరంభించి చివరికి ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేదు కోల్‌కతా నైట్‌రైడర్స్‌. ఇక సారథిగా ఈ సీజన్‌లో విఫలమైన కార్తీక్‌ ఆటగాడిగా కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. అతడాడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 253 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. జట్టుకు అవసరమైన సమయంలో కార్తీక్‌ విఫలమయ్యాడని విమర్శలు వచ్చాయి. 

అతి తక్కువ కాలంలోనే భారత జట్టులో స్థానం సంపాదించుకున్న లక్కీ ప్లేయర్ విజయ్ శంకర్. ఆల్‌‌రౌండర్ కోటాలో ప్లేస్ ఫిక్స్ చేసుకున్న విజయ్ శంకర్ ఈ సీజన్‌లో పెద్దగా మెరవలేకపోయాడు. 15 మ్యాచుల్లో 20.33 సగటుతో కేవలం 244 పరుగులు సాధించాడు విజయ్ శంకర్.

ఆల్‌రౌండ్‌ షో ఓకే..
వివాదాలతోనే కాదు ఆటతోనూ హైలెట్‌గా నిలిచాడు హార్దిక్‌ పాండ్యా. ముంబై ఇండియన్స్‌ టైటిల్‌ గెలవడంలో పాండ్యా పాత్ర మరవలేనిది. తన ఆల్‌రౌండ్‌ షోతో ముంబైకి ఘనవిజయాలందించాడు. ఇక ఈ సీజన్‌లో 16 మ్యాచుల్లో 44.86 సగటుతో 402 పరుగులు చేసిన పాండ్యా.. బౌలింగ్‌లో 14 వికెట్లు పడగొట్టాడు. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ సీజన్‌లో మామూలు ప్రదర్శనతోనే సరిపెట్టుకున్నాడు. బౌలింగ్‌లో 15 వికెట్లు తీసిన జడేజా, బ్యాటింగ్‌లో కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు.

బంతి తిప్పలేకపోయారు..
మణికట్టు స్పిన్నర్లుగా గుర్తింపు పోందిన కుల్దీప్‌ యాదవ్‌, చహల్‌లు ఈ సీజన్‌లో నిరాశపరిచారు. ముఖ్యంగా కుల్దీప్‌ వికెట్ల విషయం పక్కకు పెడితే ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. బెంగళూరుపై చెత్త ప్రదర్శనతో ఏకంగా జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ఇక చహల్‌ ఆర్సీబీ బౌలింగ్‌ భారాన్ని మోశాడు. 14 మ్యాచ్‌లు ఆడిన చహల్‌ 18 వికెట్లు తీయగా.. 9 మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్‌ కేవలం నాలుగు వికెట్లే తీసి విఫలమయ్యాడు. ఇక ఇదే సీజన్‌లో సీఎస్‌కే స్సిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ అత్యధిక వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ సొంతం చేసుకోగా.. మన స్పిన్నర్లు రాణించకపోవడం విడ్డూరం.  

బుమ్‌ బుమ్‌ బుమ్రా..
డెత్‌ ఓవర్‌ స్పెషలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న జస్ప్రిత్‌ బుమ్రా మరోసారి ఈ సీజన్‌లో తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. కీలకసమయాలలో వికెట్లు పడగొట్టి, పరుగులు కట్టడిచేసి ముంబైకి అనేక విజయాలను అందించాడు. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన ఈ స్టార్‌ పేసర్‌ 19 వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రపంచకప్‌లో బౌలింగ్‌ విభాగానికి నాయకత్వ వహించే బుమ్రా రాణింపు పైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక కింగ్స్ ఎలెవన్ తరుపున బరిలో దిగిన స్టార్ బౌలర్ మహ్మద్‌ షమీ 14మ్యాచుల్లో 19 వికెట్లు తీశాడు. పొదుపుగా బౌలింగ్ చేసే షమీ ఈ సారి 8.68 రన్‌రేట్‌తో పరుగులు సమర్పించుకోవడం విశేషం. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున బరిలో దిగిన భువనేశ్వర్‌, కొన్ని మ్యాచులకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. మొత్తంగా 15 మ్యాచుల్లో 13 వికెట్లు మాత్రమే తీసిన భువనేశ్వర్ కుమార్, కీలక సమయంలో ఫెయిల్ అవ్వడం టీమిండియాను కలవరబెట్టే అంశం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top