
నిజ్నీ నొవొగొరొడ్: అంచనాలకు అందని విధంగా సాగుతోన్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో స్వీడన్ జట్టు తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది. సోమవారం జరిగిన పోరులో స్వీడన్ 1–0తో దక్షిణ కొరియాపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్ వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) పెనాల్టీతో వచ్చింది. వెటరన్ కెప్టెన్ అండ్రియాస్ గ్రాన్‌క్విస్ట్ 62వ నిమిషంలో ఈ గోల్ చేశాడు. ఈ టోర్నీలో వీఏఆర్ ద్వారా సాకారమైన మూడో గోల్ ఇది. ఇంతకుముందు ఫ్రాన్స్, పెరూ జట్లు వీఏఆర్‌తో లబ్ధి పొందాయి. 1958లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లో 3–0తో మెక్సికోను ఓడించిన స్వీడన్... మళ్లీ ఈ ప్రపంచకప్‌లో ఆరంభ మ్యాచ్‌లోనే విజయం రుచి చూడటం విశేషం. మరోవైపు కొరియా జట్టు 1998 తర్వాత తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది.
స్వీడన్‌తో జరిగిన పోరులో కొరియా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. డిఫెన్స్ పూర్తిగా విఫలమైంది. ఫార్వర్డ్స్ చురుగ్గా స్పందించలేదు. ఈ మ్యాచ్‌లో కొరియా స్ట్రయికర్లు ఒక్కసారి కూడా లక్ష్యంపై గురిపెట్టలేకపోవడం గమనార్హం. మరోవైపు స్వీడన్ ఫార్వర్డ్ శ్రేణి పాదరసంలా కదిలింది. ప్రథమార్ధంలోనే రెండు సార్లు ప్రత్యర్థి పెనాల్టీ బాక్స్‌లోకి చొచ్చుకెళ్లినప్పటికీ... సరైన షాట్లు ఆడలేక గోల్ చేసే అవకాశాల్ని కోల్పోయింది. ఈ రెండుసార్లు స్ట్రయికర్ మార్కస్ బెర్గ్ అతి సమీపం నుంచి గోల్ కొట్టే అవకాశాల్ని చేజార్చాడు. దీంతో తొలి అర్ధభాగం గోల్ లేకుండానే 0–0తో ముగిసింది. ద్వితీయార్ధంలో ఇరు జట్ల నుంచి అదేపనిగా వచ్చిన అప్పీళ్లను రిఫరీ జోయెల్ అగ్విలర్ తోసిపుచ్చాడు. అయితే కొరియన్ ఆటగాడు కిమ్ మిన్ వూ కిమ్... విక్టర్ క్లాసెన్‌ను అనుచితంగా అడ్డుకోవడంతో ఎట్టకేలకు ఈ అప్పీల్‌ను వీఏఆర్ పద్ధతిలో సమీక్షించాడు. కొరియన్ ‘ఫౌల్’ తేలడంతో పెనాల్టీ కిక్ ఇచ్చాడు. దీన్ని ఆట 62వ నిమిషంలో గ్రాన్‌క్విస్ట్ గోల్ చేయడంతో స్వీడన్ విజయం ఖాయమైంది.