
హైదరాబాద్: ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్సీ నుంచి స్టీవ్ స్మిత్ తప్పుకోగానే ఇప్పుడు అందరి దృష్టి మరో కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఉన్న వార్నర్‌ను తప్పించే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీమ్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించాడు. వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తీసుకునే చర్యలను బట్టి తాము ముందుకు వెళతామని అతను స్పష్టం చేశాడు. ‘కేప్‌టౌన్‌లో జరిగిన ఘటన దురదృష్టకరం. అయితే సన్‌రైజర్స్ కెప్టెన్సీ గురించి అప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది.
మేం క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. మాకు ప్రస్తుతం ట్యాంపరింగ్ అంశానికి సంబంధించి పరిమిత సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. సన్‌రైజర్స్ జట్టును ఇన్నేళ్లు వార్నర్ అద్భుతంగా నడిపించాడనంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైతే మేం కెప్టెన్సీ మార్పు గురించి ఆలోచించడం లేదు’ అని లక్ష్మణ్ చెప్పాడు.