కీలక పోరుకు హైదరాబాద్‌ సై

Sunrisers Hyderabad Vs Mumbai Indians Match Today - Sakshi

నేడు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌

వార్నర్‌ స్థానంలో గప్టిల్‌

ముంబై వేదికగా ఇరు జట్ల పోరు

సాక్షి, హైదరాబాద్‌: ప్లే ఆఫ్‌ బెర్తు సాధనే లక్ష్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కీలక సమరానికి సిద్ధమైంది. నేడు ముంబై వేదికగా జరుగనున్న లీగ్‌ మ్యాచ్‌లో ఆతిథ్య ముంబై ఇండియన్స్‌ జట్టుతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతుంది. లీగ్‌ దశ మ్యాచ్‌లు దాదాపు అంతిమ దశకు చేరుకోవడంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ముంబై 16 పాయింట్లతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధిస్తుంది. ఒకవేళ విజయం హైదరాబాద్‌ను వరిస్తే 14 పాయింట్లతో ముంబై, హైదరాబాద్‌ సమంగా నిలుస్తాయి. 

వార్నర్‌ లేకుండానే...
లీగ్‌లో రైజర్స్‌ ప్రస్థానం భిన్నంగా సాగుతోంది. అయితే గొప్ప విజయాలు, లేకపోతే చెత్త ఓటములను నమోదు చేస్తూ నిలకడ లేమిని ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ కెప్టెన్, ఓపెనర్‌ వార్నర్‌ లేకుండానే నేటి మ్యాచ్‌లో హైదరాబాద్‌ బరిలో దిగనుంది. ఈ సీజన్‌లో  12 మ్యాచ్‌లాడి ఒక శతకం, 8 అర్ధశతకాలతో అతను 692 పరుగుల్ని సాధించాడు. కీలక సమయంలో వార్నర్‌ లేకపోవడం సన్‌రైజర్స్‌ జట్టుకు పెద్ద లోటు. వార్నర్‌ స్థానంలో రానున్న మార్టిన్‌ గప్టిల్‌ అతని స్థానాన్ని భర్తీ చేయాలని రైజర్స్‌ యాజమాన్యం ఆకాంక్షిస్తోంది. మనీశ్‌ పాండే పుంజుకోగా... కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఇంకా ధాటి కనబరచలేకపోతున్నాడు. విజయ్‌ శంకర్‌ అంచనాలకు తగ్గట్లుగా రాణించాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌లోనూ రషీద్‌ ఖాన్, నబీపై రైజర్స్‌ ఆధారపడుతోంది. వీరిద్దరితో పాటు పేసర్లు భువనేశ్వర్, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఆకట్టుకుంటున్నారు. లీగ్‌ దశలో 12 మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌ 6 విజయాలు, 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌ ముంబై కన్నా హైదరాబాద్‌కు మరింత కీలకం. ఒకవేళ ముంబైతో మ్యాచ్‌లో రైజర్స్‌ ఓడిపోతే తర్వాతి మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. దానితో పాటు కోల్‌కతా, పంజాబ్‌ జట్ల ఫలితాలపై ఆధారపడి రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది. 

ఒక్క విజయం దూరంలో...
లీగ్‌ ప్రారంభంలో తడబడిన ముంబై ఇండియన్స్‌ జట్టు ఇప్పుడు కుదురుకుంది. హర్దిక్‌ పాండ్యా, పొలార్డ్‌ విధ్వంసక ఆటతీరుతో కొన్ని అద్భుతమైన విజయాలు మూటగట్టుకుని ప్లే ఆఫ్‌ రేసులో నిలిచింది. వీరిద్దరూ తమ బ్యాట్‌లకు పనికల్పిస్తే హైదరాబాద్‌ ఎంత లక్ష్యం విధించినా తక్కువే అవుతుంది. మరోవైపు ప్లే ఆఫ్‌ బెర్తుకు కేవలం ఒక విజయం దూరంలోనే ఉండటంతో ఈ మ్యాచ్‌లోనే దాన్ని సాధించాలని ముంబై పట్టుదలగా ఉంది. కెప్టెన్‌ రోహిత్‌ (307 పరుగులు), డికాక్‌ (393 పరుగులు) ఓపెనింగ్‌లో రాణిస్తుండగా... మిడిలార్డర్‌లో హార్దిక్, పొలార్డ్‌ అదరగొడుతున్నారు. సూర్యకుమార్, కృనాల్‌ భారీ స్కోర్లపై దృష్టి సారిస్తే ముంబై బ్యాటింగ్‌ మరింత పటిష్టంగా మారుతుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top