సన్‌రైజర్స్‌ సగర్వంగా..

Sunrisers beat Delhi daredevils to confirm playoff berth - Sakshi

ఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సగర్వంగా ప్లే ఆఫ్‌కు చేరుకుంది. గత  విజయంతో దాదాపు ప్లే ఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకున్న సన్‌రైజర్స్‌..  గురువారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో  గెలుపొంది ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్‌కు చేరింది. ఫలితంగా ఈ సీజన్‌లో అధికారికంగా ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా సన్‌రైజర్స్‌ నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ముందుగా బ్యాటింగ్‌ చేసి 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌ 15 పరుగుల వద్ద అలెక్స్‌ హేల్స్‌(14) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో శిఖర్‌ ధావన్‌-కేన్‌ విలియమ‍్సన్‌ జోడి ధాటిగా బ్యాటింగ్‌ చేసింది. ధావన్‌(92 నాటౌట్‌; 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు), విలియమ్సన్‌(80నాటౌట్‌; 53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)లు మరో వికెట్‌ పడకుండా జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 173 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో సన్‌రైజర్స్‌ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.  ఇది సన్‌రైజర్స్‌కు ఓవరాల్‌గా తొమ్మిదో విజయం కాగా, వరుసగా ఆరో గెలుపు. ఇక తాజా ఓటమితో ఢిల్లీ ప్లే ఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

అంతకముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది.  రిషబ్‌ పంత్‌(128 నాటౌట్‌;63 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరును సన్‌రైజర్స్‌ ముందుంచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. షకిబుల్‌ హసన్‌ వేసిన నాల్గో ఓవర్‌లో పృథ్వీ షా(9), జాసన్‌ రాయ్‌(11)లు వరుస బంతుల్లో నిష్ర్రమించారు. దాంతో 21 పరుగులకే రెండు వికెట్లను నష్టపోయింది ఢిల్లీ. అయితే శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి రిషబ్‌ పంత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశాడు. కాగా, రిషబ్‌ పంత్‌ తప్పిదంతో శ్రేయస్‌ అయ్యర్‌(3) రనౌట్‌గా పెవిలియన్‌ బాటపట్టాడు. అటు తర్వాత హర్షల్‌ పటేల్‌-రిషబ్‌ పంత్‌ల భాగస్వామ్యంతో ఢిల్లీ కుదుటపడింది. హర్షల్‌ పటేల్‌(24) రనౌట్‌ కావడంతో ఢిల్లీ 98 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయింది. ఆపై రిషబ్‌ పంత్‌ చెలరేగి ఆడాడు. పటిష్టమైన సన్‌రైజర్స్‌ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగిన రిషబ్‌ పంత్‌  56 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ నమోదు చేశాడు. భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లను రిషబ్‌ సాధించడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ పోరాడి లక్ష్యాన్ని ఉంచింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top