షాకింగ్‌: ఢిల్లీ టెస్టును నిలిపేయాలని కోరిన లంక క్రికెటర్లు!

srilanka players Wear Masks to Counter Delhi Pollution - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇన్నాళ్లు దేశ రాజధాని వాసులను ఉక్కిరిబిక్కిరి చేసిన కాలుష్యం తాజాగా ఢిల్లీ టెస్టుపై కూడా ప్రభావం చూపుతోంది. కాలుష్యం కారణంగా శ్రీలంక ఆటగాళ్లు ఉక్కిరిబిక్కిరి అయినట్టు కనిపించింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందంటూ ఇద్దరు లంక ఆటగాళ్లు పెవిలియన్‌కు వెళ్లిపోయారు. దీంతో రెండోరోజు కొనసాగుతున్న ఆటను అంపైర్లు కాసేపు నిలిపివేశారు.

శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులోనూ భారత్‌ ధాటిగా ఆడుతోంది. భారత్‌ ధాటిగా ఆడుతున్న సమయంలోనే లంక ఆటగాళ్లు.. కాలుష్య ప్రభావం గురించి అంపైర్లకు ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగా లంచ్‌ తరువాత పలువురు లంక ఆటగాళ్లు మాస్క్‌లు ధరించి ఫీల్డ్‌లోకి దిగారు. కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉందని, మ్యాచ్‌ను నిలిపివేయాలని పదేపదే అంపైర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ దశలో ఇరుజట్ల కోచ్‌లు జోక్యం చేసుకోవడంతో మ్యాచ్‌ కొంతసేపు కొనసాగింది. ఈ క్రమంలో కొంతసేపు ఆట కొనసాగిన అనంతరం మరోసారి మ్యాచ్‌ కొనసాగింపుపై మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌ తో పాటు అంపైర్లు చర్చలు జరిపారు. ఈ క్రమంలో మ్యాచ్‌ కాసేపు ఆగింది. అదే సమయంలో కోహ్లి స్టేడియం నుంచి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి వచ్చేయాలంటూ ఫీల్డ్‌లో ఉన్న జడేజా, సాహాలకు సంకేతాలిచ్చాడు. దాంతో భారత్‌ జట్టు స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 536 పరుగుల వద్ద ఉండగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అంతకుముందు కోహ్లి(243) డబుల్‌ సెంచరీ సాధించిన తరువాత ఏడో వికెట్‌గా అవుటయ్యాడు.

మబ్బులతో తేమగా వాతావరణం!
దేశ రాజధాని ఢిల్లీలో గత నెల తీవ్ర కాలుష్య సమస్య నెలకొన్న సంగతి తెలిసిందే. గత నెలతో పోలిస్తే.. ఈ నెలలో కాలుష్యం తక్కువగానే ఉంది. గత ఏడాదితో పోల్చుకున్నా నగరంలో వాతావరణం మెరుగ్గా ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అయితే, ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మబ్బులుపట్టి.. వాతావరణం కొంత స్తబ్దుగా ఉంది. గాలిలో వేగం కూడా లేకపోవడంతో ఆ ప్రభావం మ్యాచ్‌పై పడి ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్‌ ఎయిర్‌ క్వాలిటీ ఉందంటూ లంక ఆటగాళ్ల ఫిర్యాదుపై ప్రస్తుతం అంపైర్లు మంతనాలు సాగిస్తున్నట్టు  తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఆపై ఇన్నింగ్స్‌ ఆరంభించిన లంక జట్టు తొలి బంతికి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ దిముత్‌ కరుణరత్నే డకౌట్‌గా పెవిలియన్‌​ చేరాడు. మొహ్మద్‌ షమీ వేసిన బంతికి కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top