సన్‌రైజర్స్‌ అలవోకగా..

SRH Beat KKR By 9 Wickets - Sakshi

హైదరాబాద్‌: సొంత మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్‌ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ 15 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. డేవిడ్‌ వార్నర్‌(67; 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు), బెయిర్‌ స్టో(80 నాటౌట్; 43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు‌)లు సన్‌రైజర్స్‌ ఘన విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 131 పరుగులు సాధించడంతో సన్‌రైజర్స్‌ సునాయాసంగా గెలుపును అందుకుంది. ఇది సన్‌రైజర్స్‌కు ఐదో విజయం.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. కోల్‌కతా ఆటగాళ్లలో క్రిస్‌ లిన్‌(51; 47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), రింకూ సింగ్‌(30; 25 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు),సునీల్‌ నరైన్‌(25; 8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోరు సాధించకపోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి కేకేఆర్‌ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు.  ఖలీల్‌ అహ్మద్‌ మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్‌ కుమార్‌ రెండు వికెట్లు తీశాడు. సందీప్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌లకు తలో వికెట్‌ దక్కింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌లు ఆరంభించారు. ఒకవైపు క్రిస్‌ లిన్‌ కుదురుగా ఆడితే, నరైన్‌ మాత్రమ బ్యాట్‌ ఝుళిపించాడు. తాను ఎదుర్కొన్న ఎనిమిది బంతుల్లో ఐదు బంతుల్ని బౌండరీలు దాటించాడు. అయితే నరైన్‌ మరింత ప్రమాదకరంగా మారుతున్నసమయంలో  ఖలీల్‌ అహ్మద్‌ బౌల్డ్‌ చేశాడు. దాంతో కేకేఆర్‌ 42 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆపై శుభ్‌మన్‌ గిల్‌(3), నితీష్‌ రాణా(11), దినేశ్‌ కార్తీక్‌(6)లు విఫలం కావడంతో కేకేఆర్‌ 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో లిన్‌-రింకూ సింగ్‌ జోడి మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 51 పరుగులు జోడించడంతో పరిస్థితి కాస్త కుదుటపడింది. వీరిద్దరూ 9 పరుగుల వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో కేకేఆర్‌ పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. ఆండ్రీ రసెల్‌(15;9 బంతుల్లో 2 సిక్సర్లు) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోవడంతో కేకేఆర్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top