పాండ్యా, రాహుల్‌ల వివాదంలో అతని బాధ్యత లేదా?

Sreesanth Says Karan Johar Responsible too For Hardik Pandya And KL Rahul Statements - Sakshi

వివాదస్పద క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఫైర్‌

ముంబై : మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలతో సస్పెన్షన్‌కు గురైన టీమిండియా క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌లను వివాదస్పద క్రికెటర్‌, బిగబాస్‌ సీజన్‌ 12 రన్నరప్‌ శ్రీశాంత్‌ మరోసారి వెనకేసుకొచ్చాడు. పెద్ద దుమారం రేపిన ఈ వివాదంలో బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌కు బాధ్యత లేదా? అని ఈ క్రికెటర్‌ కమ్‌ యాక్టర్‌ ప్రశ్నించారు. ఈ వివాదానికి మూల కారణం కరణేనని అభిప్రాయపడ్డాడు.

ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘క్రికెటర్లు సోయి మరిచి తప్పుగా మాట్లాడితే.. షో హోస్ట్‌ కరణ్‌కు ఏమైంది? వారు తప్పు మాట్లాడుతుంటే టీవీ హోస్ట్‌గా అడ్డుకోవాల్సిన బాధ్యత అతనిపై లేదా? అతను కచ్చితంగా అడ్డుకోవాల్సింది. ఈ వివాదానికి మూల కారణం కరణ్‌ జోహరే. అతను అడిగిన పిచ్చి ప్రశ్నల వల్లే క్రికెటర్లు నోరు జారారు. ఈ వివాదంలో కరణ్‌ కూడా భాగస్వామియే.’ అని శ్రీశాంత్‌ మండిపడ్డాడు. ఈ యువ క్రికెటర్లపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్న సందర్భంలో కూడా శ్రీశాంత్‌ మద్దతు పలికాడు. వారు మాట్లాడింది తప్పేనని, కానీ దాన్ని ఇంత వివాదం చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఇంత కంటే పెద్ద తప్పులు చేసిన వారు స్వేచ్ఛగా క్రికెట్‌ ఆడుతున్నారని, వారిపై ఎలాంటి చర్యలు లేవని చెప్పుకొచ్చాడు. ఇలాంటి తప్పులు జరగడం సహజమని, కేవలం క్రికెట్‌లోనే కాకుండా అన్ని రంగాల్లో ఇలాంటివి చోటుచేసుకుంటాయని ఈ యువ ఆటగాళ్లను శ్రీశాంత్‌ వెనకేసుకొచ్చిన విషయం తెలిసిందే.

నిషేధం కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన పాండ్యా, రాహుల్‌లు మళ్లీ ఎప్పుడు క్రికెట్‌లో అడుగు పెడతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. బీసీసీఐ నియమావళి ప్రకారం ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే తుది అధికారం బోర్డు నియమించిన అంబుడ్స్‌మన్‌కే ఉంది. ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్‌మన్‌కే ఇవ్వాలి. అయితే ఇప్పటికిప్పుడు అంబుడ్స్‌మన్‌ను నియమించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అంబుడ్స్‌మన్‌ను నియమించే అధికారం కేవలం బోర్డుకే ఉందని...అది ఎన్నికలు నిర్వహించి కార్యవర్గం ఏర్పడిన తర్వాత మాత్రమే సాధ్యమని తెలిపింది. దీంతో పాండ్యా, రాహుల్‌ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

చదవండి: బయటకు వచ్చిన పాండ్యా !

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top