క్వార్టర్స్‌లో సింధు | Sindhu enters Indonesia Open quarters, Srikanth ousted | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సింధు

Jul 19 2019 5:04 AM | Updated on Jul 19 2019 2:13 PM

Sindhu enters Indonesia Open quarters, Srikanth ousted - Sakshi

జకార్తా: ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్స్‌లో ప్రవేశించింది. గురువారం 62 నిమిషాల పాటు సాగిన మహిళల ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌లో ఐదో సీడ్‌ సింధు 21–14, 17–21, 21–11 తేడాతో మియా బ్లిచ్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌) పై గెలిచింది. మ్యాచ్‌ను డెన్మార్క్‌ షట్లర్‌ ధాటిగా ఆరంభించింది. సింధుపై మొదటి గేమ్‌లో 6–3తో ఆధిక్యంలో వెళ్లింది. వెంటనే తేరుకున్న సింధు వెంట వెంటనే పాయింట్లు సాధించి స్కోరును సమం చేసింది.

తర్వాత మరింత దూకుడును పెంచిన సింధు సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్‌ షాట్లతో హోరెత్తించి మొదటి గేమ్‌ను 21–14తో కైవసం చేసుకుంది. అయితే రెండో గేమ్‌ను మియా గెలవడంతో మ్యాచ్‌ మూడో గేమ్‌కు దారితీసింది. మూడో గేమ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సింధు 21–11తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మియా బ్లిచ్‌ఫెల్ట్‌పై సింధుకిది మూడో విజయం కావడం విశేషం. గతంలో ఇండియన్‌ ఓపెన్, సింగపూర్‌ ఓపెన్‌లలో సింధు ఆమెను మట్టికరిపించింది.

పురుషుల ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ కిడాంబి శ్రీకాంత్‌ 17–21, 19–21తో ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌) చేతిలో వరుస గేమ్‌లలో చిత్తయ్యాడు. పురుషుల డబుల్స్‌లో భారత జోడి సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి 15–21, 14–21తో టోర్నీ టాప్‌ సీడ్‌ మార్కస్‌ గిడియోన్‌ – కెవిన్‌ సంజయ(ఇండోనేషియా) జంట చేతిలో... మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా (భారత్‌) 14–21, 11–21తో టాప్‌ సీడ్‌ జెంగ్‌ సి వె–హువాంగ్‌ యా కియోంగ్‌ (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైయ్యారు. శుక్రవారం జరిగే మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మూడో సీడ్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)తో సింధు పోటీ పడనుంది. వీరిద్దరూ 14 సార్లు తలపడగా.. చెరో ఏడు సార్లు గెలిచి సమంగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement