సెమీస్‌లో షరపోవా | Sharapova and Bouchard Gain French Open Semifinals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో షరపోవా

Jun 4 2014 1:21 AM | Updated on Sep 2 2017 8:16 AM

సెమీస్‌లో షరపోవా

సెమీస్‌లో షరపోవా

ఫ్రెంచ్ ఓపెన్‌లో రష్యా అందాల తార మరియా షరపోవా జోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్, ఏడోసీడ్ షరపోవా 1-6, 7-5, 6-1తో ప్రపంచ 35వ ర్యాంకర్, అన్‌సీడ్ గార్బిని ముగురుజా (స్పెయిన్)పై విజయం సాధించింది.

బౌచర్డ్ కూడా...   
 ఫ్రెంచ్ ఓపెన్
 పురుషుల్లో జొకోవిచ్,
 గుల్బిస్ ముందంజ
 
 పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో రష్యా అందాల తార మరియా షరపోవా జోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్, ఏడోసీడ్ షరపోవా 1-6, 7-5, 6-1తో ప్రపంచ 35వ ర్యాంకర్, అన్‌సీడ్ గార్బిని ముగురుజా (స్పెయిన్)పై విజయం సాధించింది. తద్వారా సెమీస్‌లోకి ప్రవేశించింది. రెండు గంటలా ఆరు నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్యా ప్లేయర్ నిలకడను ప్రదర్శించింది.
 
  ఆరంభంలో నెమ్మదిగా ఆడుతూ 0-4తో వెనుకబడి తొలిసెట్‌ను చేజార్చుకున్నా... చివరి రెండు సెట్లలో కచ్చితమైన సర్వీస్‌లు, పదునైన షాట్లతో చెలరేగింది. చివరి 10 గేమ్‌ల్లో 9 గెలుచుకుంది. మరోవైపు తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్ మ్యాచ్ ఆడుతున్న ముగురుజా ప్రారంభంలో మెరుగైన షాట్లతో అలరించింది. మరో క్వార్టర్స్‌లో 18వ సీడ్ ఎగుని బౌచర్డ్ (కెనడా) 7-6 (4), 2-6, 7-5తో 14వ సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)పై నెగ్గింది.
 
 బెర్డిచ్‌కు షాక్: పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఆరోసీడ్ థామస్ బెర్డిచ్ (చెక్)కు నిరాశ ఎదురైంది. 18వ సీడ్ ఎర్నెస్ట్ గుల్బిస్ (లాత్వియా) 6-3, 6-2, 6-4తో బెర్డిచ్‌పై గెలిచాడు. మరో మ్యాచ్‌లో రెండోసీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 7-5, 7-6 (7/5), 6-4తో ఎనిమిదో సీడ్ మిలోస్ రావోనిక్ (కెనడా)పై నెగ్గాడు.
 
 సానియా జోడి పరాజయం: మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడికి చుక్కెదురైంది. క్వార్టర్‌ఫైనల్లో ఐదోసీడ్ సానియా ద్వయం 2-6, 6-3, 3-6తో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌సీడ్ సూ వీ సెయి (చైనీస్‌తైపీ)-షుయె పెంగ్ (చైనా)ల చేతిలో ఓడింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా-బ్లాక్ ఎనిమిది బ్రేక్ పాయింట్ అవకాశాల్లో మూడింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. ఐదుసార్లు సర్వీస్‌ను కోల్పోయింది. సానియా జోడి ఓటమితో రోలాండ్ గారోస్‌లో భారత పోరు ముగిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement