అజేయంగా సెమీస్‌కు... | Sania Mirza-Martina Hingis advance to semis of WTA Finals | Sakshi
Sakshi News home page

అజేయంగా సెమీస్‌కు...

Oct 30 2015 11:58 PM | Updated on Sep 3 2017 11:44 AM

అజేయంగా సెమీస్‌కు...

అజేయంగా సెమీస్‌కు...

తమ విజయపరంపరను కొనసాగిస్తూ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం.. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో...

* సానియా-హింగిస్ జంట ‘హ్యాట్రిక్’ విజయం
* డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ టోర్నీ
సింగపూర్: తమ విజయపరంపరను కొనసాగిస్తూ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం.. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ‘రెడ్ గ్రూప్’ చివరి లీగ్ మ్యాచ్‌లో సానియా-హింగిస్ జంట 6-4, 7-5తో తిమియా బాబోస్ (హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జోడీపై విజయం సాధించింది. ఈ గెలుపుతో ఈ ఏడాది ఇదే జంట చేతిలో రోమ్ ఓపెన్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది.

గంటన్నరపాటు జరిగిన మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ జంటకు తొలి సెట్‌లో స్కోరు 4-4 వద్ద ఉన్నపుడు... రెండో సెట్‌లో స్కోరు 5-5 వద్ద ఉన్నపుడు బ్రేక్ పాయింట్ అవకాశాలు లభించాయి. ఈ రెండింటిని వారు సద్వినియోగం చేసుకొని విజయాన్ని దక్కించుకున్నారు. సానియా-హింగిస్‌కు జంటగా వరుసగా ఇది 20వ విజయం కావడం విశేషం. శనివారం జరిగే సెమీఫైనల్లో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంటతో సానియా-హింగిస్ ద్వయం తలపడుతుంది.

‘ఈ మ్యాచ్‌కు ముందు వారితో రెండుసార్లు తలపడ్డాం. గెలుపోటముల్లో 1-1తో సమఉజ్జీగా ఉన్నాం. దాంతో ఆద్యంతం జాగ్రత్తగా ఆడాలని నిర్ణయించుకున్నాం. ఎప్పటిలాగే మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాం. అనుకున్న ఫలితాన్ని సాధించాం’ అని మ్యాచ్ అనంతరం సానియా మీర్జా వ్యాఖ్యానించింది. ఎనిమిది నెలల క్రితం మార్టినా హింగిస్‌తో జతకట్టిన సానియా అద్వితీయ ఫలితాలు సాధించింది.

హింగిస్‌తో కలిసి ఈ ఏడాది ఏకంగా ఎనిమిది డబుల్స్ టైటిల్స్ సాధించింది. అందులో రెండు గ్రాండ్‌స్లామ్ (వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టోర్నమెంట్‌లు కూడా ఉండటం విశేషం. మరో రెండు విజయాలు సాధిస్తే సానియా-హింగిస్ ఖాతాలో ప్రతిష్టాత్మక డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ కూడా చేరుతుంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement